చంద్రబాబు ప్రాణాలకు ముప్పు..! మోదీకి లేఖ రాసింది ఎవరంటే..?
అనపర్తిలో చంద్రబాబు సభకు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత దాన్ని రద్దు చేశారని, లారీలు, ట్రాక్టర్లు పెట్టి చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్నారని తన లేఖలో మోదీ, అమిత్ షా కు ఫిర్యాదు చేశారు
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా లకు ఏపీనుంచి లేఖలు వెళ్లాయి. అయితే ఈ లేఖలు రాసించి చంద్రబాబో లేక టీడీపీ నేతలో కాదు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. బాబు ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నివేదిక తెప్పించుకోవాలని కోరుతూ ఆయన కేంద్రానికి లేఖలు రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
వైసీపీ ఎంపీ లేఖలతో కేంద్రం చర్యలు తీసుకుంటుందనుకోలేం కానీ, టీడీపీ నేతలు కూడా స్పందించకముందే రఘురామ ఇలా బహిరంగంగా చంద్రబాబుపై ఉన్న భక్తిని చాటుకోవడమే ఇప్పుడు విశేషం. సీఎం జగన్ ఆదేశాలతో ఏపీ పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. చంద్రబాబు పర్యటనల్లో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. సీఎం జగన్ ఆదేశాలతోనే పోలీసు శాఖలోని పలువురు అధికారులు.. చంద్రబాబుని వేధిస్తున్నారని, అదే సమయంలో సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.
అనపర్తిలో చంద్రబాబు సభకు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత దాన్ని రద్దు చేశారని, లారీలు, ట్రాక్టర్లు పెట్టి చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్నారని తన లేఖలో మోదీ, అమిత్ షా కు ఫిర్యాదు చేశారు రఘురామ కృష్ణంరాజు. బారికేడ్లు ఏర్పాటు చేసి విద్యుత్తు సరఫరా నిలిపివేశారని, దీంతో రాత్రి వేళ సెల్ ఫోన్ల వెలుతురులో ఆయన 7 కిలోమీటర్లు నడిచి వెళ్లారన్నారు. ఆ సమయంలో తగిన పోలీసు బందోబస్తు లేదని, జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న నేత వాహన కదలికలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే కాకుండా పోలీసులే స్వయంగా రోడ్డుపై కూర్చొని ప్రతిపక్షనేత యాత్రను అడ్డుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
నివేదిక తెప్పించుకోవాలి..
పోలీసుల తీరుపై కేంద్ర అధికారులతో తక్షణమే నివేదిక తెప్పించుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. అనపర్తి అరాచక ఘటనతో జగన్ ప్రభుత్వానికి శుభం కార్డు పడినట్టేనన్నారు. ఇటు టీడీపీ నేతలు కూడా తమ యాత్రలను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వానికి ప్రతిపక్షం అంటే భయం మొదలైందని ఎద్దేవా చేస్తున్నారు.