Telugu Global
Andhra Pradesh

జగన్ కు జోగయ్య, జోగయ్యకు గుడివాడ.. లెటర్ వార్

జగన్ సినిమాల్లో విలన్ అంటూ జోగయ్య నోరు జారితే.. ఏకంగా జోగయ్యను భూమికి భారంగా తేల్చేశారు మంత్రి గుడివాడ. అసలీ లేఖల యుద్ధం ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైందో మీరే చూడండి.

జగన్ కు జోగయ్య, జోగయ్యకు గుడివాడ.. లెటర్ వార్
X

ఏపీలో పొలిటికల్ లెటర్ వార్ మొదలైంది. వారికి వీరు, వీరికి ఇంకొకరు.. ఇలా లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా సీఎం జగన్ కు హరిరామ జోగయ్య ఓ ఘాటు లేఖ రాయగా, జోగయ్యకు మంత్రి గుడివాడ అమర్నాథ్ అంతకంటే ఘాటుగా మరో లేఖ రాశారు. జగన్ సినిమాల్లో విలన్ అంటూ జోగయ్య నోరు జారితే.. ఏకంగా జోగయ్యను భూమికి భారంగా తేల్చేశారు మంత్రి గుడివాడ. అసలీ లేఖల యుద్ధం ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైందో మీరే చూడండి.

ఇటీవల అమ్మఒడి సభలో పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం జగన్, తాజాగా చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ సభలో మరోసారి పవన్ పై ధ్వజమెత్తారు. పవన్ ప్యాకేజీ శూరుడంటూ మండిపడ్డారు. దీంతో హరిరామ జోగయ్యకు కోపమొచ్చింది. ఇప్పటికే ఆయన పలుసందర్భాల్లో సీఎం జగన్ కి లేఖాస్త్రాలు సంధించారు. తాజాగా మరోసారి పవన్ కి వకాల్తా పుచ్చుకుంటూ జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హుందాతనంలో 10శాతం కూడా జగన్ లో లేదని బహిరంగ లేఖ రాశారు హరిరామ జోగయ్య. జగన్ సినిమాల్లో విలన్ పాత్రకు సరిపోతారేమో అనిపిస్తోందన్నారు. పవన్ పెళ్లిళ్లపై జగన్ చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. పవన్ ను విమర్శించడానికి మరో విషయం లేకే పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తున్నారని చెప్పారు. దోచుకోవడం, దాచుకోవడం జగన్ కుటుంబానికి అలవాటన్నారు. ప్యాకేజీలు తీసుకునే సంస్కృతి జగన్ కే ఉందని ఘాటుగా ఆ లేఖలో ప్రస్తావించారు జోగయ్య.

బదులిచ్చిన మంత్రి..

హరిరామ జోగయ్య లేఖకు అంతే ఘాటుగా బదులిచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జోగయ్య సీనియర్ ప్యాకేజ్ స్టార్ అని, నమ్మక ద్రోహి అని విమర్శించారు. మాట్లాడలేని, కనీసం పెన్ను పట్టుకోలేని వయసులో ఆయన రాతలు జుగుప్స కలిగిస్తున్నాయని మండిపడ్డారు అమర్నాథ్. జోగయ్య భూమికి భారం అని, చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ తీసుకుని సంతకం పెట్టి లేఖలు విడుదల చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

నాబోటి వారికి మీకు సమాధానం చెప్పక తప్పడం లేదంటూనే, ఏ మనిషికైనా వయసు పెరిగేకొద్దీ సంస్కారం పెరుగుతుందని, కానీ పవన్ కల్యాణ్ సాంగత్యంతో వయసు పెరిగేకొద్దీ జోగయ్యలో అశ్లీలత పెరుగుతోందని విమర్శించారు అమర్నాథ్. అందుకే ఇలాంటి చెత్త ఉత్తరాలను జనం మీదకు వదిలారని, స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరితో జోగయ్య పోటీపడాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోందని తన లేఖలో ప్రస్తావించారు. "జోగయ్య గారూ.. సెన్సేషన్ కావడం కోసం అడ్డమైన వాగుడు వాగి, టీవీలకు, పత్రికలకు, సోషల్ మీడియాకు అందులో కూడా ప్రత్యేకించి ఎల్లో మీడియాకు మీరు మేత అందించాలనుకుంటున్నారు. మీ దిగజారుడుతనం పగవాడికి కూడా వద్దు. మీ పద్ధతి బాగుందో లేదో, కనీసం మీ పిల్లల్ని, మీ శ్రేయోభిలాషులను కనుక్కుని మీరు విచక్షణతో, విజ్ఞతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను." అంటూ తన లేఖను ముగించారు అమర్నాథ్. ప్రస్తుతం ఈ రెండు లేఖలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

First Published:  4 July 2023 10:44 PM IST
Next Story