ముస్లింల హక్కులు కాపాడే జగన్‌నే గెలిపించుకుందాం.. రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం
రాష్ట్రంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం ముస్లింలంతా ఏకతాటిపై పనిచేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ మీడియాకు తెలిపారు.
ముస్లింల హక్కులు కాపాడే జగన్‌నే గెలిపించుకుందామని ముస్లిం మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ’ముస్లిం సమస్యలు – ప్రజాస్వామ్య పరిరక్షణ మార్గాలు’ అనే అంశంపై విజయవాడలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని ముస్లిం ఉలేమాలు, జమాత్ ప్రతినిధులు, డాక్టర్లు, లాయర్లు, పలు రంగాలకు చెందిన నిపుణులు, ఆలోచనాపరులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. కూటమి కుతంత్రంతో ముస్లిం సమాజం పెను ప్రమాదంలో పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం హక్కులు కాపాడతానని భరోసా ఇచ్చిన సెక్యులర్ లీడర్ సీఎం వైఎస్ జగన్‌ను గెలిపించుకోవడం మన ధర్మమని ముస్లిం మేధావి వర్గం తేల్చిచెప్పింది. ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ), ముస్లిం ఆలోచనపరుల వేదిక (ఎంటీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
విద్యాపరంగానూ, సామాజికంగానూ అత్యంత వెనుకబాటుకు గురైన ముస్లింలకు వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని ఈ సందర్భంగా సమావేశంలో గుర్తుచేసుకున్నారు. అవి మతపరమైన రిజర్వేషన్లుగా దుష్ప్రచారం చేసి ఎన్డీఏ కూటమి ముస్లిం సమాజాన్ని దారుణంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, వక్స్ బోర్డును తీసివేస్తామనే ప్రకటనలతో మైనార్టీల పట్ల వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలను అవమానిస్తున్న ఎన్డీఏ కూటమితో గతంలోనూ, ఇప్పుడు జతకట్టిన చంద్రబాబు.. ముస్లిం సమస్యలపై పోరాడుతానంటే ఎలా నమ్మాలని వారు ప్రశ్నించారు. కూటమిలో చేరిన టీడీపీ, జనసేన రానున్న కాలంలో బీజేపీలో విలీనం కావడం ఖాయమన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం ముస్లింలంతా ఏకతాటిపై పనిచేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ మీడియాకు తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు కాపాడతానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించాకే బీజేపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు మూకుమ్మడిగా ఆయనపై దాడిని పెంచాయన్నారు. ధైర్యంగా ముస్లింలకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి గెలిపించుకోవడం మన బాధ్యతగా తెలిపారు.