అలిపిరి నడక మార్గంలో చిరుత, ఎలుగుబంటిల సంచారం
తిరుమలకు వచ్చే భక్తుల నడక మార్గంలో జంతువుల సంచారాన్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నామని ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆదివారం తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత, ఎలుగుబంటిల సంచారాన్ని అధికారులు గుర్తించారు. నడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాల్లో శుక్ర, శనివారాల్లో అర్ధరాత్రి వేళ ఒక ఎలుగు బంటి, రెండు చిరుతలు కనిపించాయని అధికారులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నరసింహస్వామి ఆలయం సమీపంలోనూ ఎలుగుబంటి సంచారాన్ని అధికారులు గుర్తించారు.
తిరుమలకు వచ్చే భక్తుల నడక మార్గంలో జంతువుల సంచారాన్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నామని ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఇందులో భాగంగానే నడక దారిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
అటవీ శాఖ అధికారుల సూచన మేరకు ఇప్పటికే భక్తులకు కర్రలు అందిస్తున్న దేవస్థానం సిబ్బంది.. భక్తులను గుంపులు గుంపులుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. గుంపులుగా ఉండటం, చేతిలో కర్రలు ఉండటం వల్ల జంతువులు దాడికి దిగే ఆలోచన చేయవని, ఒకవేళ దాడికి దిగే ప్రయత్నం చేసినా.. భక్తులందరూ కర్రలతో దాడికి సిద్ధమైతే.. జంతువులు దూరంగా వెళ్లిపోయే అవకాశముంటుందని చెబుతున్నారు.