అది ఆడ చిరుత.. వయసు 4 ఏళ్లు
చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్లు ఉన్నాయా లేదా అనేది తెలుసుంటామని చెబుతున్నారు జూ పార్క్ అధికారులు. ఆ తర్వాత అటవీ అధికారుల సూచన మేరకు దాన్ని జూ లోనే ఉంచుతారా, లేక అడవిలో వదిలిపెడతారా అనేది నిర్ణయిస్తారు.
తిరుమలలో అటవీ సిబ్బంది ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుత వయసు 4 ఏళ్లుగా నిర్థారించారు. అది ఆడ చిరుత అని తేలింది. బోనులో చిక్కిన చిరుతను తిరుపతిలోని ఎస్వీ జూపార్క్ కి తరలించారు. బాలికపై దాడి చేసిన చిరుత ఇదేనా కాదా అనేది నిర్థారించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్లు ఉన్నాయా లేదా అనేది తెలుసుంటామని చెబుతున్నారు జూ పార్క్ అధికారులు. ఆ తర్వాత అటవీ అధికారుల సూచన మేరకు దాన్ని జూ లోనే ఉంచుతారా, లేక అడవిలో వదిలిపెడతారా అనేది నిర్ణయిస్తారు.
జూన్ 24న బోనులో చిరుత పిల్ల చిక్కింది. ఈరోజు బోనులో చిక్కింది నాలుగేళ్ల చిరుత. ఈ రెండూ ఒకటి కాదు అనేది మాత్రం ప్రస్తుతానికి నిర్థారణ అయింది. అంటే గతంలో దాడి చేసిన చిరుత కాకుండా, మరికొన్ని మెట్ల మార్గం వద్ద సంచరిస్తున్నాయనేది తేలిపోయింది. ప్రస్తుతం పట్టుకున్న చిరుతతో సమస్య పూర్తిగా తొలగిపోలేదు. మరిన్ని చిరుతలు అక్కడ తిరుగుతున్నాయని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. వాటికోసం కూడా గాలిస్తున్నారు.
అదుగో చిరుత..
ప్రస్తుతం అలిపిరి నడక మార్గంలో ఏ చిన్న అలికిడి వచ్చినా భక్తులు బెంబేలెత్తుతున్నారు. నరసింహ స్వామి ఆలయం దగ్గర్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్న వారు మాత్రం తాము కూడా చిరుతను చాశామని చెబుతున్నారు. ఘటనా స్ధలంకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత కాలి ముద్రలు సేకరించారు. చిరుతను చూసి కొంతమంది భక్తులు పరుగులందుకున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి.
ఎలుగుబంటి కలకలం..
శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఈరోజు ఎలుగుబంటి సంచారం భక్తులను భయాందోళనలకు గురి చేసింది. ఇటీవల ఓ ఎలుగుబంటి మెట్ల మార్గాన్ని దాటే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు 2 వేల మెట్టు దగ్గర భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. ఎలుగుబంటి జనసమూహాన్ని చూసి పారిపోతుందని, భయాందోళనలకు గురికావొద్దని చెబుతున్నారు అధికారులు. గుంపులు గుంపులుగా కొండపైకి ఎక్కాలని భక్తులకు సూచిస్తున్నారు. ఒంటరిగా మెట్ల మార్గంలో సంచరించొద్దని హెచ్చరిస్తున్నారు.