Telugu Global
Andhra Pradesh

మహానందిలో చిరుత సంచారం.. - సీసీ కెమెరాలో గుర్తింపు

నల్లమలలో చిరుత కోసం బోను, 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే అటుగా సంచరించే చిరుత పులి అంతటా తిరుగుతోందని, బోనులోకి మాత్రం రావడం లేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

మహానందిలో చిరుత సంచారం.. - సీసీ కెమెరాలో గుర్తింపు
X

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలో మంగళవారం చిరుత దాడిలో మహిళ మృతిచెందిన ఘటనను మరువకముందు బుధవారం మహానందిలోని గోశాల వద్ద చిరుత సంచారం కలవరానికి గురిచేస్తోంది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చిరుత పులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత సంచారంపై ఆలయ ఏఈఓ ఓంకారం వెంకటేశ్వరుడు, సిబ్బంది వెంటనే నంద్యాల జిల్లా ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ దినేష్‌ కుమార్‌ రెడ్డి, డీఆర్డీఓ హైమావతి, ఎఫ్‌బీఓ ప్రతాప్‌లకు సమాచారం అందించారు. మహిళ మృతి ఘటనతో అటవీ శాఖ అధికారులు పచ్చర్ల వద్ద నల్లమలలో చిరుత కోసం బోను, 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే అటుగా సంచరించే చిరుత పులి అంతటా తిరుగుతోందని, బోనులోకి మాత్రం రావడం లేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ప్రకాశం జిల్లాలో చిరుతను బంధించిన సిబ్బంది

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దేవనగరం సమీపంలో ఓ చిరుత పులిని అటవీ శాఖ అధికారులు బుధవారం బంధించారు. బుధవారం నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఒక చిరుత పులి దేవనగరం గ్రామ శివారులో మేకలు మేపుకునేవారి కంట పడింది. దీంతో వారు కేకలు వేయగా.. చిరుతపులి అక్కడే ఉన్న ఓ పాడుబడిన బావిలోకి దిగింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను బంధించారు. పట్టుబడిన చిరుతను బోనులో బంధించి అడవిలో వదలనున్నట్టు ఆటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

First Published:  27 Jun 2024 8:50 AM IST
Next Story