Telugu Global
Andhra Pradesh

ఆ చిరుతలను వదిలిపెట్టాలనే నిర్ణయం సరైనదేనా..?

లక్షితను చంపిన చిరుత ఏది అని కనిపెట్టేందుకు తిరుపతి జూ పార్క్ లో ఉన్న 4 చిరుతలకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. ఆ ఫలితాలు వచ్చాక మిగిలినవాటిని అడవిలో సుదూరంగా తీసుకెళ్లి వదిలిపెడతామంటున్నారు.

ఆ చిరుతలను వదిలిపెట్టాలనే నిర్ణయం సరైనదేనా..?
X

తిరుమల నడక మార్గం సమీపంలో మొత్తం ఐదు చిరుతలను బంధించారు అటవీ అధికారులు. వాటిలో ఒకదాన్ని గతంలోనే అడవిలో వదిలిపెట్టగా ప్రస్తుతం 4 చిరుతలు తిరుపతి జూ పార్క్ లో ఉన్నాయి. వీటిని కూడా అడవిలో వదిలిపెట్టే అవకాశముంది. అయితే వెంట వెంటనే రెండు దాడులు జరగడం, ఒక చిరుతను అనాలోచితంగా అడవిలో వదిలిపెట్టిన తర్వాత రెండోదాడి జరగడంతో టీటీడీపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి పట్టుకున్న 4 చిరుతలను తిరుపతి జూ పార్క్ లోనే ఉంచారు. వీటిలో లక్షితపై దాడి చేసిన చిరుత ఏదనేది తేలితే దాన్ని మాత్రం జూ పార్క్ లో ఉంచి, మిగతా వాటిని అడవిలో వదిలిపెడతామంటున్నారు ఏపీ ప్రిన్సిపల్‌ సీసీఎఫ్‌వో వై.మధుసూదన్‌ రెడ్డి.

మ్యాన్ ఈటర్ అదొక్కటేనా..?

లక్షితను చంపిన చిరుత ఏది అని కనిపెట్టేందుకు తిరుపతి జూ పార్క్ లో ఉన్న చిరుతలకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. ఆ ఫలితాలు వచ్చాక లక్షితను చంపిన చిరుత వాటిలో ఉంటే, దాన్ని మాత్రం జూ పార్క్ లో పెడతామంటున్నారు, మిగిలినవాటిని అడవిలో సుదూరంగా తీసుకెళ్లి వదిలిపెడతామంటున్నారు. అయితే మ్యాన్ ఈటర్ అదొక్కటేనా అనేది తేలాల్సి ఉంది. లక్షితపై దాడి చేసిన చిరుత కూడా తొలిసారి దాడికి పాల్పడింది అనుకోవాలి. మిగతా చిరుతలు నడక మార్గంవైపు తిరిగి రావు అనడానికి గ్యారెంటీ లేదు. ట్రాప్ కెమెరాల్లో చిక్కిన చిరుతలు ఇంకా 5 ఉన్నాయని, వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు అధికారులు. నడక మార్గం దగ్గర్లో చిరుతలు పదుల సంఖ్యలో సంచరిస్తుంటే, వాటిని తిరిగి అడవిలో వదిలిపెట్టాలనే సాహసం సరైనదేనా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఓవర్ పాస్ ల నిర్మాణం..

మరోవైపు అలిపిరి-తిరుమల నడకమార్గంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు అధికారులు. భక్తుల కోసం ఎలివేటెడ్‌ ఫుట్‌ పాత్‌ లు ఏర్పాటు చేస్తామంటున్నారు. జంతువులు సులభంగా నడకదారిని దాటేందుకు ఓవర్‌ పాస్‌ల నిర్మాణాలు చేపట్టే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిపారు. యానిమల్‌ ఓవర్‌ పాస్‌ నిర్మాణం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేశారు. నడకదారి నుంచి 10 నుంచి 20 మీటర్ల పరిధిలో చెట్లు తొలగించే ప్రతిపాదన కూడా ఉంది. టీటీడీ, అటవీశాఖ ఆధ్వర్యంలో 500 కెమెరాలతో రియల్‌ టైమ్‌ వైల్డ్‌ లైఫ్‌ మానిటరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం నడకదారిలో 130 మంది అటవీ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సంఖ్య మరింత పెంచబోతున్నారు.

First Published:  13 Sept 2023 8:32 AM IST
Next Story