తిరుమలలో బాలుడిపై చిరుత దాడి
బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని, ప్రాణాపాయం లేదని తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. కాలినడక మార్గంలో భక్తులను యథావిధిగా అనుమతిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తిరుమలకు వెళ్లే నడక మార్గంలో మూడేళ్ల బాలుడిపై చిరుత పులి దాడి చేసింది. బాలుడిని పొదల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది కేకలు వేయడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ప్రసన్నాంజనేయ స్వామి గుడి సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్ గా గుర్తించారు.
సమాచారం అందుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సంఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని, ప్రాణాపాయం లేదని తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. కాలినడక మార్గంలో భక్తులను యథావిధిగా అనుమతిస్తున్నట్లు ఆయన చెప్పారు. చిరుత దాడి నేపథ్యంలో భక్తులను గుంపులుగా పంపుతున్నామన్నారు. నడక దారిలో చిరుత దాడి చేయడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.