Telugu Global
Andhra Pradesh

నీడలా వెంటాడుతున్న వీడియో.. మాధవ్ పై సీబీఐకి ఫిర్యాదు చేసిన న్యాయవాది..

గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఏపీ హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. చెన్నైలోని సీబీఐ కార్యాలయానికి ఆయన ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపించారు.

నీడలా వెంటాడుతున్న వీడియో.. మాధవ్ పై సీబీఐకి ఫిర్యాదు చేసిన న్యాయవాది..
X

వీడియో వ్యవహారం ఎంపీ గోరంట్ల మాధవ్ ని విడిచిపెట్టేలా లేదు. ఎస్పీ క్లీన్ చిట్ ఇచ్చినా, పార్టీ పెద్దగా పట్టించుకోకపోయినా వ్యవహారం పార్లమెంట్ వరకు వెళ్లింది. జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకోవడం, లోక్ సభ స్పీకర్ కి, ప్రధాని మోదీకి లేఖ రాయడంతో ఈ వ్యవహారంపై కేంద్రం కూడా దృష్టిసారించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా సీబీఐ కూడా దీనిపై దృష్టిసారించేలా ఉంది. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఏపీ హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. చెన్నైలోని సీబీఐ కార్యాలయానికి ఆయన ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపించారు.

జుగుప్సగా ఉంది..

వీడియో కాల్ లో ఎంపీ ఓ మహిళతో అసభ్యకరంగా వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు న్యాయవాది లక్ష్మీనారాయణ. ఫిర్యాదు కాపీతోపాటు, వీడియో క్లిప్పింగ్ ని కూడా ఆయన జతచేసి పంపించారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని కోరారు.

సామాజిక వర్గాల మధ్య చిచ్చు..

వీడియో కాల్ బయటకు వచ్చిన తర్వాత కావాలనే ఓ సామాజిక వర్గం వారిని టార్గెట్ చేశారని, వారిని అప్రదిష్టపాలు చేస్తూ ఎంపీ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ చేసిన వ్యాఖ్యలతో రెండు వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగే అవకాశముందని కూడా ఆయన తెలిపారు. ఎంపీ మాధవ్‌ వ్యవహారంపై సీబీఐ సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మరోవైపు మాధవ్ వీడియో ఒరిజినల్ అంటూ అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను టీడీపీ బయటపెట్టింది. అప్పటి వరకు అది నకిలీ వీడియో అన్న అనంతపురం ఎస్పీ.. టీడీపీ స్టేట్ మెంట్ ని పరిగణలోకి తీసుకోకపోవడం విశేషం. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర విచారణ సంస్థల చేతుల్లోనుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్లే అవకాశముంది. మహిళా కమిషన్ ఫిర్యాదుపై కానీ, న్యాయవాది ఫిర్యాదుపై కానీ స్పందన వస్తే కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ మొదలవుతుంది.

First Published:  16 Aug 2022 2:41 PM GMT
Next Story