చివరి ఆశకూడా ఆవిరైపోయిందా..?
ఆ కేసును విచారించిన సుప్రీంకోర్టు జేఏసీ అడిగినట్లు స్టే ఇవ్వటం సాధ్యంకాదని తేల్చేసింది. అంతేకాకుండా ఈ కేసును రాజధాని కేసులు విచారిస్తున్న బెంచ్ కి బదిలీచేసింది.
ఇళ్ళపట్టాల కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న అమరావతి జేఏసీ చివరి ప్రయత్నం కూడా ఆవిరైపోయింది. పట్టాల పంపిణీపై స్టే ఇవ్వటానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. 50 వేలమంది పేదలకు అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ళపట్టాలు పంపిణీ చేసేందుకు ఆర్-5 జోన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీళ్ళకి సుమారు 1,500 ఎకరాలను సెంటు భూమిచొప్పున పంపిణీచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈనెల 18వ తేదీన పట్టాల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. పేదలకు ఇళ్ళపట్టాలను ఇవ్వకుండా అడ్డుకునేందుకు జేఏసీ శతవిధాల ప్రయత్నాలు చేసింది.
నిజానికి అమరావతి జేఏసీ ముసుగులో ఎక్కువమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, రైతుల నుండి భూములు కొనుగోలు చేసిన వాళ్ళు, టీడీపీ నేతలే ఉన్నారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. తమ ప్రాంతంలో పేదలు నివసిస్తే భూముల విలువ తగ్గిపోతుందన్నది వీళ్ళ వాదన. అందుకనే డెమొగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటూ హైకోర్టులో కేసువేశారు. కేసును అత్యవసరంగా విచారించాలని జేఏసీ అడిగింది. అందుకు నిరాకరించిన హైకోర్టు అంత అర్జంటైతే కేసును సుప్రీం కోర్టులో వేయమని సూచించింది.
దాంతో హైకోర్టులో కేసును సుప్రీం కోర్టుకు మార్చుకున్నది జేఏసీ. అయితే సుప్రీంకోర్టులో జేఏసీ వాదన వీగిపోయింది. జేఏసీ అడిగినట్లు స్టే ఇవ్వటానికి నిరాకరించి హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పింది. వెంటనే హైకోర్టులో జేఏసీ కేసు వేసింది. కేసు విచారించిన హైకోర్టు జేఏసీ అడిగినట్లు స్టే ఇవ్వటానికి నిరాకరించింది. పైగా పట్టాల పంపిణీకి గ్నీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఎప్పుడైతే హైకోర్టులో తమ వాదనకు చుక్కెదురైందో వెంటనే జేఏసీ సుప్రీం కోర్టులో మళ్ళీ కేసువేసింది.
ఆ కేసును విచారించిన సుప్రీంకోర్టు జేఏసీ అడిగినట్లు స్టే ఇవ్వటం సాధ్యంకాదని తేల్చేసింది. అంతేకాకుండా ఈ కేసును రాజధాని కేసులు విచారిస్తున్న బెంచ్ కి బదిలీచేసింది. దాంతో ఈనెల 18వ తేదీన ఇళ్ళపట్టాల పంపిణీ చేయటానికి మార్గం దొరికింది. పట్టాల పంపిణీకి ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లను చాలా స్పీడుగా చేసేస్తోంది. అంటే అమరావతి జేఏసీ చివరి ఆశకూడా ఆవిరైపోయిందని అర్థమవుతోంది. మరిప్పుడు జేఏసీ ఏమిచేస్తుందో చూడాల్సిందే.