దుర్గ గుడి రోడ్డుపై విరిగిపడిన కొండ చరియలు
దుర్గ గుడి అధికారులు ప్రత్యేక క్రేన్లు తెప్పించి రోడ్డుపై పడిన కొండ రాళ్లను తొలగిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులను ఘాట్ రోడ్డు వైపు కాకుండా మల్లికార్జున మండపం మెట్లమార్గం వైపు మళ్లించారు.
విజయవాడ దుర్గగుడి రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దుర్గగుడి కేశ ఖండన శాల సమీపంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమీపంలోని సబ్‌వేను కూడా మూసివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
దుర్గ గుడి అధికారులు ప్రత్యేక క్రేన్లు తెప్పించి రోడ్డుపై పడిన కొండ రాళ్లను తొలగిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులను ఘాట్ రోడ్డు వైపు కాకుండా మల్లికార్జున మండపం మెట్లమార్గం వైపు మళ్లించారు. ఈ ఘటనలో సబ్‌వే సమీపంలో నిలిపిన 6 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కొండరాళ్లు పూర్తిగా తొలగిస్తే తప్ప ట్రాఫిక్ పునరుద్ధరణ సాధ్యపడదని వన్‌టౌన్ ట్రాఫిక్ సీఐ సుధాకర్ తెలిపారు. వాహనాల రాకపోకలను కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి కొనసాగిస్తామని వివరించారు.