Telugu Global
Andhra Pradesh

సినిమా టికెట్ల ధరల పెంపున‌కు అనుమతి.. మరి పంటల ధరలు పెంచరా..?

తెలంగాణలో గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు మల్టీప్లెక్స్ లో అయితే రూ.400, సింగిల్ స్క్రీన్ లలో అయితే రూ.250 ఉన్నాయి. ఏపీలో టికెట్ ధరపై అదనంగా రూ. 50 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సినిమా టికెట్ల ధరల పెంపున‌కు అనుమతి.. మరి పంటల ధరలు పెంచరా..?
X

సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చే ప్రభుత్వాలు.. పంట ఉత్ప‌త్తుల‌ ధరల విషయంలో మాత్రం ఎందుకు దగా చేస్తున్నాయని సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా గుంటూరుకారం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. తెలంగాణలో గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు మల్టీప్లెక్స్ లో అయితే రూ.400, సింగిల్ స్క్రీన్ లలో అయితే రూ.250 ఉన్నాయి. ఏపీలో టికెట్ ధరపై అదనంగా రూ. 50 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సినిమా టికెట్ ధరలు మూవీ విడుదలైనప్పటి నుంచి పదిరోజుల వరకు అమ‌లు ఉంటాయి. అంతకుముందు ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల సమయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ ధర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాయి.

ఈ నేపథ్యంలో దీనిపై జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తున్నారు గానీ, అన్నం పెట్టే రైతు పండించిన పంట ధర విషయంలో దగా చేస్తున్నారు' అంటూ ట్వీట్ చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం పేరు ఎత్తని లక్ష్మీనారాయణ పంటలకు మద్దతు ధరలు లభించనప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు.

First Published:  11 Jan 2024 6:22 PM IST
Next Story