తారకరత్న ఎప్పుడో చనిపోయారు, కానీ..! –లక్ష్మీపార్వతి
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన రోజే.. తారకరత్న మృతిచెందాడని, అయితే అప్పుడే ఆ వార్త ప్రకటిస్తే అది లోకేష్ పాదయాత్రకు అపశకునం అవుతుందని చంద్రబాబు భావించారని అన్నారు లక్ష్మీపార్వతి.
తారకరత్న మృతిపై సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మీపార్వతి. అస్వస్థతతో ఆస్పత్రిలో చేర్పించినప్పుడే తారకరత్నకు ప్రాణం లేదని వైద్యులు చెప్పారని, కానీ చంద్రబాబు తన కుటిల రాజకీయాలకోసం ఇన్నాళ్లూ ఆ చావు వార్తను బయటకు రానీయకుండా చేశారని, ప్రజల్ని మభ్యపెట్టారని, తారకరత్న కుటుంబాన్ని కూడా మోసం చేశారని అన్నారు. నారా కుటుంబం నీచమైన రాజకీయాలు చేయడం ఆపేస్తే, నందమూరి కుటుంబం బాగుపడుతుందని అన్నారామె.
అపశకునంగా భావించి..
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన రోజే.. తారకరత్న మృతిచెందాడని, అయితే అప్పుడే ఆ వార్త ప్రకటిస్తే అది లోకేష్ పాదయాత్రకు అపశకునం అవుతుందని చంద్రబాబు భావించారని అన్నారు లక్ష్మీపార్వతి.
అందుకే ఆ వార్తను బయటకు రానీయలేదని చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయ కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారన్నారు. ప్రాణం లేని భర్త పక్కన భార్య ఉండటం, ఆమెను ఎంతగా మానసిక క్షోభకు గురిచేసిందో అర్థం చేసుకోవచ్చన్నారు.
రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసి అప్పుడే మరణ వార్త ప్రకటించి ఉండాలన్నారు. కానీ యాత్ర వాయిదా వేసుకోడానికి లోకేష్ ఇష్టపడలేదని, అందుకే ఇన్నిరోజులు ఆస్పత్రిలో తారకరత్నకు వైద్యం అందించినట్టు మభ్యపెట్టారని చెప్పారు.
తండ్రీకొడుకులే అపశకునం..
లోకేష్ యాత్రకు తారకరత్న మరణవార్త అపశకునం అనుకున్నారని, కానీ రాష్ట్రానికి తండ్రీకొడుకులు చంద్రబాబు-లోకేష్.. పెద్ద అపశకునం అని అన్నారు లక్ష్మీపార్వతి. ఇకనైనా చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నీచ రాజకీయాలు ఆపేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందన్నారు.