Telugu Global
Andhra Pradesh

తండ్రికి అండగా లేని బాలయ్య.. ప్రజలకు అండగా ఉంటారా..?

అభిమానం వేరు, అభివృద్ధి వేరు అని చెప్పారు లక్ష్మీపార్వతి. బాలకృష్ణపై అభిమానం ఉంటే, అంతవరకే పరిమితం చేసుకోవాలని, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మాత్రం వైసీపీకి ఓటు వేయాలని కోరారు.

తండ్రికి అండగా లేని బాలయ్య.. ప్రజలకు అండగా ఉంటారా..?
X

చంద్రబాబు, బాలకృష్ణను టార్గెట్ చేశారు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి. వైసీపీ తరపున ప్రచారం మొదలుపెట్టిన ఆమె.. చంద్రబాబుకి వ్యతిరేకంగా కుప్పంలో, బాలయ్యకు వ్యతిరేకంగా హిందూపురంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, బాలయ్యను ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆ రెండు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు లక్ష్మీపార్వతి.

కుప్పం నియోజకవర్గంలో ఇటీవల పర్యటించారు లక్ష్మీపార్వతి. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేశారు. అధికారం కోసం బాబు ఎదురు చూస్తున్నారని, మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు ఆగిపోతాయన్నారు. హిందూపురంలో కూడా ఆమె పర్యటించారు. బాలకృష్ణను ఓడించాలన్నారు. హిందూపురం అభివృద్ధి జరగాలంటే అక్కడ వైసీపీ అభ్యర్థి గెలవాలన్నారు లక్ష్మీపార్వతి.

అభిమానం వేరు, అభివృద్ధి వేరు..

అభిమానం వేరు, అభివృద్ధి వేరు అని చెప్పారు లక్ష్మీపార్వతి. బాలకృష్ణపై అభిమానం ఉంటే, అంతవరకే పరిమితం చేసుకోవాలని, కానీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మాత్రం వైసీపీకి ఓటు వేయాలని కోరారు.వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత తన తండ్రి ఎన్టీఆర్ కి అండగా నిలబడని బాలకృష్ణ, హిందూపురం ప్రజలకు ఏ రకంగా అండగా ఉంటారని ప్రశ్నించారామె. గతంలో బాలకృష్ణ హత్య కేసులో ఇరుక్కున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని తాను స్వయంగా కలిసి.. కేసు లేకుండా చేయించానని చెప్పుకొచ్చారు. అందుకు బాలకృష్ణే సాక్ష్యం అన్నారు. ఆపదలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు లక్ష్మీపార్వతి.

నందమూరి కుటుంబ సభ్యులంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బాలకృష్ణకోసం ఆయన భార్య, పెద్దల్లుడు లోకేష్ కోసం బాలయ్య పెద్ద కుమార్తె, చిన్నల్లుడు భరత్ కోసం బాలయ్య చిన్న కుమార్తె ప్రచారానికి వస్తున్నారు. చంద్రబాబు సతీమణి సహా నందమూరి కుటుంబ సభ్యులంతా ప్రచార పర్వంలోకి వచ్చారు, టీడీపీ నేతల గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు. లక్ష్మీపార్వతి మాత్రం టీడీపీ నేతలు ఓడిపోవాలని ప్రచారం చేపట్టారు. ప్రత్యేకంగా కుప్పం, హిందూపురంపై ఆమె ఫోకస్ పెట్టారు.

First Published:  3 May 2024 6:51 PM IST
Next Story