Telugu Global
Andhra Pradesh

కర్నూలు జిల్లాలో కూటమి విలవిల.. వైసీపీలోకి వలసలు

సీఎం జగన్ యాత్ర పల్నాడు జిల్లాలో ఉండగా.. ఇటు కర్నూలు నేతలు అక్కడకు వెళ్లి మరీ సీఎం జగన్ ని కలిశారు. ధూళిపాళ్ల నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, బీజేపీ నేతలు వైసీపీలో చేరారు.

కర్నూలు జిల్లాలో కూటమి విలవిల.. వైసీపీలోకి వలసలు
X

ఎక్కడైనా అభ్యర్థుల ప్రకటనకు ముందు పార్టీలోకి వలసలు ఉంటాయి. టికెట్ కోసం ఆశావహులు క్యూ కడుతుంటారు. కానీ ఏపీలో మాత్రం అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా వైసీపీలోకి వసలలు జోరందుకోవడం విశేషం. ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ ఈ వలసలు మరింత పెరుగుతున్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ వద్దకు వస్తున్న ఇతర పార్టీల నేతలు వైసీపీ కండువా కప్పుకుని ఆయనకు జై కొడుతున్నారు. పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామని చెబుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా వాసులు సీఎం జగన్ ని కలసి వైసీపీ కండువా కప్పుకున్నారు.

సీఎం జగన్ యాత్ర పల్నాడు జిల్లాలో ఉండగా.. ఇటు కర్నూలు నేతలు అక్కడకు వెళ్లి మరీ సీఎం జగన్ ని కలిశారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, బీజేపీ నేతలు వైసీపీలో చేరారు. సీఎం జగన్.. వారందర్నీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆలూరు నియోజకవర్గ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ మసాల పద్మజ వైసీపీలో చేరారు. కోడుమూరు నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి కూడా ఈరోజు వైసీపీ కండువా కప్పుకున్నారు. అదే నియోజకవర్గం నుంచి మరో కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఇక బీజేపీ నుంచి ఆలూరు నియోజకవర్గ నేత, మాజీ మేయర్ కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్‌ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్‌.. వైసీపీలో చేరడం విశేషం.


గతంలో వైసీపీ చేరికలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. అభ్యర్థుల ప్రకటన తర్వాత.. స్వచ్ఛందంగా అందరూ పార్టీలో చేరుతుంటే మాత్రం ఎవరినీ కాదనట్లేదు. ఒకరకంగా ఈ చేరికలతో వైరి వర్గంలో భయం మొదలైంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలైన తర్వాత చేరికలు మరింత జోరందుకున్నాయి. నేరుగా సీఎం జగన్ కండువా కప్పే అవకాశం ఉండటంతో.. చాలామంది ఆశావహులు వైసీపీలోకి క్యూ కడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు.. ఇతర కీలక స్థానాల్లో పనిచేసిన వారు కూడా ఎన్నికల వేళ వైసీపీవైపు వచ్చేస్తున్నారు.

First Published:  12 April 2024 12:47 PM IST
Next Story