జగన్ ప్లాన్ మామూలుగా లేదు.. కుప్పంలో బాబుకి కష్టకాలమే
వైసీపీ గెలుపుని ముందే ఊహించి వివిధ నియోజకవర్గాల నేతలు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.
'మేమంతా సిద్ధం' బస్సుయాత్రలో కూడా సీఎం జగన్ కుప్పంపై ఫోకస్ తగ్గించలేదు. మంత్రి పెద్ది రెడ్డి ఆధ్వర్యంలో కుప్పంలో చంద్రబాబు కూసాలు కదిల్చేపని చేస్తున్నారు. తాజాగా కుప్పం నియోజకవర్గం టీడీపీకి చెంది నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఉమ్మడి చిత్తూరు మాజీ జడ్పీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యం నాయుడు సహా పలువురు నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ కూడా పాల్గొన్నారు.
జగన్ వ్యూహాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఇటీవల కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసారి భువనేశ్వరి కూడా కుప్పంలోనే మకాం వేసి చంద్రబాబు గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాగళం యాత్రను కూడా కుప్పంనుంచే ప్రారంభించి అక్కడే మూడు రోజులు ఉన్నారు చంద్రబాబు. కుప్పం గెలుపు తనకు నల్లేరుపై నడక అనుకునే స్థాయి నుంచి, ఓ దశలో నియోజకవర్గం కూడా మార్చేందుకు ఆయన ఆలోచించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి చంద్రబాబుకి ఎన్నికలు జరిగే వరకూ జగన్ షాకుల మీద షాకులిచ్చేస్తున్నారు.
కుప్పంతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ సత్తా చూపేందుకు సిద్ధమవుతోంది. 2019లో టీడీపీ తరపున గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ.హరికృష్ణ తాజాగా వైసీపీలో చేరారు. ఆయన మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు. డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి ఆధ్వర్యంలో వారికి సీఎం జగన్ వైసీపీ కండువాలు కప్పారు.
బస్సుయాత్రలో ప్రజలను నేరుగా కలుస్తూ, తన పాలన గురించి వివరిస్తూ, వైరి వర్గంపై విమర్శల దాడి చేస్తున్న సీఎం జగన్.. మరోవైపు చేరికలతో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. వైసీపీ గెలుపుని ముందే ఊహించి వివిధ నియోజకవర్గాల నేతలు ఆయన సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం.. లో ఈసారి ప్రత్యర్థులను వణికించేలా వైసీపీ వ్యూహ రచన చేస్తోంది.