పవన్ కల్యాణ్‌కు పోలీసుల నోటీసులు
సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదని, బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తే వాటి పర్యవసానాలు ప్రజాజీవనంపై ప్రభావం చూపుతాయని ఎస్పీ చెప్పారు.

పవన్ కల్యాణ్‌కు పోలీసుల నోటీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కృష్ణాజిల్లాలో కొనసాగుతున్న వారాహి యాత్ర బుధవారం పెడనలో జరగనుంది. ఈ నేపథ్యంలో పెడనలో వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారంటూ పవన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలకు సాక్షాలు ఉన్నాయా.. ఏ ఆధారంతో ఆరోపణలు చేశారో చెప్పాలంటూ పవన్‌కు నోటీసులు ఇచ్చినట్టు కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. దాడులు జరుగుతాయనే సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందనేది తమకు తెలియపర్చమని నోటీసుల్లో కోరామని తెలిపారు.
తాము పంపిన నోటీసులకు పవన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఈ సందర్భంగా ఎస్పీ చెప్పారు. దీనిని బట్టి ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అనుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చేసే క్రమంలో పవన్ కల్యాణ్ తన కేడర్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఎస్పీ చెప్పారు. మీరు తిరగబడి కాళ్లూ చేతులూ కట్టేయండంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అందుకే పవన్‌కు నోటీసులు ఇచ్చామని తెలిపారు.
సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదని, బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తే వాటి పర్యవసానాలు ప్రజాజీవనంపై ప్రభావం చూపుతాయని ఎస్పీ చెప్పారు. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలని చెప్పారు. తమ సమాచార వ్యవస్థ తమకుందని, పవన్ కంటే తమ నిఘా వ్యవస్థ బలంగా ఉందని తెలిపారు. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. బుధవారం పెడనలో జరుగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు కుట్ర జరుగుతోందంటూ పవన్ ఆరోపించారు. మంగళవారం మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ సంచలన ఆరోపణలు చేశారు. పెడన వారాహి యాత్రలో గూండాలు, క్రిమినల్స్‌తో రాళ్ల దాడులు చేసి, రక్తపాతం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.