కోటంరెడ్డిని ఫుల్లుగా వాడేస్తున్న చంద్రబాబు
ఇప్పటికిప్పుడు కోటంరెడ్డిని టీడీపీలో చేర్చుకోకుండా ఆయన్ను కొన్నిరోజులపాటు జిల్లా సమస్యలపై ఉద్యమం చేసేలా చంద్రబాబు టాస్క్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో సమస్యలపై గళమెత్తి, నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనంలో ఉండేలా, అధికార పార్టీని ఇబ్బంది పెట్టేలా ప్రణాళిక సిద్ధమైంది.
వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ కండువా కప్పుకోకపోయినా ఆ పార్టీలో చేరినట్టే లెక్క. ముందుగానే తమ్ముడు గిరిధర్ రెడ్డిని టీడీపీలోకి పంపి నెల్లూరు రూరల్ సీటుని రిజర్వ్ చేసుకున్నారు శ్రీధర్ రెడ్డి. ఈ క్రమంలో చంద్రబాబు కూడా కోటంరెడ్డిని టీడీపీ నాయకుడిలాగే వాడేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే కోటంరెడ్డిని పార్టీకోసం ఉపయోగించుకోవాలేది ఆయన ఆలోచన. టీడీపీలో మాటకు మాట రెట్టించే నేతలున్నా.. ఆ విమర్శలు ఎవరికీ పెద్దగా ఆనవు, లాజిక్ కి కూడా అందవు. కానీ కోటంరెడ్డి విమర్శల్లో లాజిక్ ఉంటుంది. ఆయన పేరు నెల్లూరు జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా తెలుసు. అందులోనూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల తర్వాత వరుస ప్రెస్ మీట్లతో ఆయన అధికార పార్టీని హడలెత్తించారు. అసెంబ్లీ ముందు కూడా ప్లకార్డులు పట్టుకుని హడావిడి చేశారు, అసెంబ్లీ లోపల కూడా నిల్చుని దీక్ష చేసి, చివరకు సస్పెండై బయటకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ఆయన్ను పూర్తి స్థాయిలో వైసీపీపై ప్రయోగించబోతున్నారు. శాంపిల్ గా అమరావతి దీక్షకు కోటంరెడ్డిని రప్పించారు.
అమరావతి ఆందోళన 1200 రోజుకి చేరుకున్న సందర్భంలో వివిధ పార్టీల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. కోటంరెడ్డి కూడా నెల్లూరు నుంచి అమరావతికి వెళ్లి దీక్షలో పాల్గొన్నారు. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు తిరుమల యాత్రకు వెళ్తున్న సందర్భంలో నెల్లూరుకు చేరుకునే సరికి భారీ వర్షాలు పడ్డాయి. అప్పుడు కోటంరెడ్డి వారికి అండగా నిలిచే ప్రయత్నం చేశారు. అప్పుడు తాను చేసిన పని జగన్ కు నచ్చలేదని, అప్పటినుంచే తాను జగన్ కి టార్గెట్ అయ్యానని కూడా కోటంరెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. అలా కోటంరెడ్డికి అమరావతి రైతులకు పరిచయాలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు దూతగా ఆ శిబిరానికి వెళ్లిన కోటంరెడ్డి వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అమరావతిలో ఒక్క మట్టిపెళ్లను కూడా కదల్చలేరంటూ మండిపడ్డారు.
ఇప్పటికిప్పుడు కోటంరెడ్డిని టీడీపీలో చేర్చుకోకుండా ఆయన్ను కొన్నిరోజులపాటు జిల్లా సమస్యలపై ఉద్యమం చేసేలా చంద్రబాబు టాస్క్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో సమస్యలపై గళమెత్తి, నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనంలో ఉండేలా, అధికార పార్టీని ఇబ్బంది పెట్టేలా ప్రణాళిక సిద్ధమైంది. లోకేష్ యాత్రను నెల్లూరు జిల్లాలో విజయవంతం చేసే బాధ్యత కూడా కోటంరెడ్డికే అప్పగించారు.
ఇప్పటి వరకూ కోటంరెడ్డి జిల్లా నాయకుడిగానే ఉన్నారు, ఇప్పుడు ఆయనకు అంతకు మించిన ప్రాధాన్యతనివ్వబోతోంది టీడీపీ. టీడీపీ అనుకూల మీడియాలో వచ్చే చర్చల్లో కూడా కోటంరెడ్డికి ప్రాధాన్యత దక్కుతోంది. తటస్థుడిగా ఆయన చర్చల్లో పాల్గొంటూ వైసీపీని ఇరుకున పెడుతూ పరోక్షంగా టీడీపీకి సపోర్ట్ చేస్తుంటారు. మొత్తమ్మీద పార్టీ కండువా కప్పుకోకముందే ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఫుల్లుగా వాడేస్తున్నారు చంద్రబాబు