నాగబాబు ఇంతకు తెగించారా..?
మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేశ్వరం పోలింగ్ బూత్ పరిధిలో ఓటు కోసం నాగేంద్రబాబు పేరుతో భార్య, కొడుకు డిసెంబర్ 4వ తేదీన ఫారం 6తో దరఖాస్తు చేసుకున్నారట.
కోడలుకు బుద్ధి చెప్పి అత్త తెడ్డునాకిందన్న సామెతలా ఉంది నాగేంద్రబాబు వ్యవహారం. నాగేంద్రబాబు అంటే ఎవరో కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబే. అసలు పేరు కొణిదెల నాగేంద్రబాబు అయితే నాగబాబుగా పాపులరయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. దొంగఓట్ల విషయంలో అందరు అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ నేతలు చేయిస్తున్న దొంగఓట్ల విషయమై జనసేన నేతలు, క్యాడర్ నిఘా ఉంచాలని పవన్, నాగబాబు పదేపదే చెబుతున్నారు. ఒకవైపు వైసీపీ దొంగఓట్లు చేర్పించటం, అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాల్లో నుంచి తొలగిస్తున్నారని నాగబాబు ఆరోపిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.
అయితే తాజాగా బయటపడింది ఏమిటంటే.. నాగబాబు కుటుంబంతో కలిసి ఏపీలో ఓటు నమోదుకు ప్రయత్నించారు. ఓటు నమోదు చేసుకోవటంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాకపోతే తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు వేసి మళ్ళీ ఏపీ ఎన్నికల్లో ఓట్లు వేయటానికి రెడీ అవటమే పెద్ద తప్పు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబు ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 168లో ఓటు వేశారట. 168 పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్లజాబితాలో నాగబాబు సీరియల్ నెంబర్ 323.
అలాగే ఆయన భార్య కొణిదెల పద్మజ సీరియల్ నెంబర్ 324, కొడుకు సాయి వరుణ్ తేజ సీరియల్ నెంబర్ 325తో ఓట్లేశారట. అయితే తొందరలో ఏపీలో జరగబోతున్న ఎన్నికల్లో ఓట్లేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేశ్వరం పోలింగ్ బూత్ పరిధిలో ఓటు కోసం నాగేంద్రబాబు పేరుతో భార్య, కొడుకు డిసెంబర్ 4వ తేదీన ఫారం 6తో దరఖాస్తు చేసుకున్నారట.
తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావు పేరుతో ఓటు వేసి వడ్డేపల్లి పోలింగ్ బూత్ పరిధిలో నాగేంద్రబాబు పేరుతో దరఖాస్తు అందించారట. రాబోయే ఎన్నికల్లో నాగబాబు కాకినాడ పార్లమెంటు స్థానంలో పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎక్కడ పోటీచేస్తారనే విషయాన్ని పక్కనపెట్టేస్తే మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేపల్లి పోలింగ్ బూత్ పరిధిలో ఎందుకు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకున్నారన్నది ఆసక్తిగా ఉంది. మరి దీనిపై నాగబాబు ఏమి సమాధానం చెబుతారో చూడాలి.