కోడెల శివరాం అనధికారిక బహిష్కరణ..?
నేరుగా చంద్రబాబు, ఆయన కుటుంబాన్నే టార్గెట్ చేయడంతో అప్పటి నుంచి కోడెల శివరాంతో టీడీపీ నేతలు కలవడం లేదు. కలిస్తే నాయకత్వానికి ఎక్కడ కోపం వస్తుందోనని దూరంగా ఉంటున్నారు.
కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాంతో టీడీపీ సంబంధాలు దాదాపు తెగిపోతున్నాయి. ఇప్పుడు ఆయన కార్యక్రమాలకు కూడా పార్టీ నేతలు రావడం లేదు. గురువారం తన తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులను ఆహ్వానించానని.. వస్తానని చెప్పి రాకపోవడం బాధ కలిగించిందని శివరాం చెబుతున్నారు. తనపై పార్టీలో కొందరు కుట్రలు చేస్తున్నారని, ఇంతకాలం పార్టీ మీద గౌరవంతో నోరు విప్పలేదు గానీ, ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణకు వస్తానని చెప్పి జిల్లా అధ్యక్షుడు రాకపోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
పార్టీ అధినాయకత్వంపై ఇటీవల కోడెల శివరాం చేసిన ఆరోపణల కారణంగానే జిల్లా అధ్యక్షుడు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న ప్రచారం నడుస్తోంది. సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణను ప్రకటించిన తర్వాత కోడెల శివరాం ఆ మరుసటి రోజే సాక్షి పత్రికకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని అనడంతో పాటు ఆయన్ను కలవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదు.. ఐదు లక్షలు ఇస్తే చంద్రబాబుతో భోజనం చేయవచ్చట అంటూ కామెంట్ చేశారు.
11 ఏళ్ల పాటు తన తండ్రి కష్టపడి బసవతారకం ఆస్ప్రతిని నిర్మిస్తే ఆయన చనిపోయిన తర్వాత ట్రస్ట్ మెంబర్‌గా తన తల్లికి కూడా స్థానం ఇవ్వలేదన్నారు. ఆ స్థానంలో చంద్రబాబు కోడలు వచ్చారని ఇది అన్యాయం, ట్రస్ట్ నిబంధనలకు విరుద్దం అని కూడా అన్నారు. ఇలా నేరుగా చంద్రబాబు, ఆయన కుటుంబాన్నే టార్గెట్ చేయడంతో అప్పటి నుంచి కోడెల శివరాంతో టీడీపీ నేతలు కలవడం లేదు. కలిస్తే నాయకత్వానికి ఎక్కడ కోపం వస్తుందోనని దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కోడెల శివరాం.. టీడీపీలో ఉన్న మరో కేశినేని నాని అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏం చేసినా టికెట్ వచ్చే అవకాశం లేదు. ప్రాధాన్యత లభించే ప్రసక్తే లేదన్న భావన ఏర్పడింది.