Telugu Global
Andhra Pradesh

టీడీపీ నుండి కోడెల ఫ్యామిలీ ఔట్?

శివరామ్‌ను టీడీపీలో నేతలే కాదు చివరకు కార్యకర్తలు కూడా లెక్కచేయటం లేదు. టికెట్ ఆశించి కొంతమంది మద్దతుదారులతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. ఈ మధ్య ఇదే విషయమై శివరామ్‌తో చంద్రబాబు మాట్లాడుతూ.. సత్తెనపల్లి టికెట్ ఇచ్చేదిలేదని చెప్పేశారట.

టీడీపీ నుండి కోడెల ఫ్యామిలీ ఔట్?
X

తెలుగుదేశం పార్టీకి కోడెల ఫ్యామిలీకి మధ్య బంధం దాదాపు తెగిపోయినట్లేనా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. మాజీ మంత్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు టీడీపీతో సుదీర్ఘమైన అనుబంధముంది. ఎన్‌టీఆర్‌ పార్టీ పెట్టేనాటికి మంచి డాక్టరుగా ప్రాక్టీసు చేస్తున్న కోడెల టీడీపీలో చేరారు. మంచి దూకుడు మీదుండే కోడెల అంటే ఎన్‌టీఆర్‌ కూడా అభిమానంగా ఉండేవారు.

1983-99 మధ్య ఐదుసార్లు నరసరావుపేట నుండి కోడెల ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఓడిపోవటంతో 2014లో నరసరావుపేట కాకుండా సత్తెనపల్లిలో పోటీ చేసి స్పీకర్ అయ్యారు. స్పీకర్ అయిన తర్వాత కోడెలపైన విపరీతమైన అవినీతి ఆరోపణలొచ్చాయి. అలాగే తండ్రి అధికారాలను అడ్డం పెట్టుకుని కొడుకు కోడెల శివరాం, కూతురు విజయలక్ష్మి చాలా దందాలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. వీళ్ళ దెబ్బకు టీడీపీ నేతలే 'కే ట్యాక్స్' అనే పదాన్ని కనిపెట్టారట.

కే ట్యాక్స్ అంటే కోడెల ట్యాక్సన్నమాట. నరసరావుపేట, సత్తెనపల్లిలో ఏ పనిచేయాలన్నా ముందుగా కే ట్యాక్స్ కట్టాల్సిందే అన్నట్లుగా తయారైంది. తన మన అని చూడకుండా కొడుకు, కూతురు తమిష్టంవచ్చినట్లు వ్యవహరించారనే ఆరోపణలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో పార్టీలోనే కోడెలకు శ‌త్రువులు పెరిగిపోయారు. ఆ సమయంలోనే ఎన్నికలు జరగటం పార్టీతో పాటు కోడెల కూడా ఓడిపోయారు. అప్పటి నుండి చంద్రబాబు నాయుడుకు దూరమైపోవటంతో పాటు అప్పటి పరిస్ధితుల కారణంగా చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. దాని ప్రభావమే ఇప్పుడు కొడుకు శివరామ్ మీద పడింది.

శివరామ్‌ను టీడీపీలో నేతలే కాదు చివరకు కార్యకర్తలు కూడా లెక్కచేయటం లేదు. టికెట్ ఆశించి కొంతమంది మద్దతుదారులతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. ఈ మధ్య ఇదే విషయమై శివరామ్‌తో చంద్రబాబు మాట్లాడుతూ.. సత్తెనపల్లి టికెట్ ఇచ్చేదిలేదని చెప్పేశారట. తండ్రి పోయిన సానుభూతి కూడా శివరామ్ మీద ఎవరు చూపించటంలేదన్న విషయాన్ని చంద్రబాబు డైరెక్టుగానే చెప్పేశారట. దీంతోనే శివరామ్‌కు టికెట్ దక్కదని తేలిపోయింది. సో, కోడెల ఫ్యామిలీకి టీడీపీతో బంధం దాదాపు తెగిపోయినట్లే అనుకోవాలి. మరిక్కడ ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి.

First Published:  3 Dec 2022 11:23 AM IST
Next Story