పవన్ కు నాలుగు మంచిమాటలు.. మళ్లీ తెరపైకి కొడాలి నాని
పవన్ కల్యాణ్ వారాహియాత్రలతో ఎవరికీ అభ్యంతరం లేదని, ఎన్నికలయ్యే వరకూ పవన్ రాష్ట్ర ప్రజల మధ్య తిరిగినా తమకు అభ్యంతరం లేదన్నారు నాని. అయితే చంద్రబాబు, 420 బ్యాచ్ తో కలిసి రాజకీయ దాడికి దిగితే మాత్రం ఊరుకునేది లేదన్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చారు. ఆ మధ్య తన అనారోగ్యం వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు మీడియాకు కనపడిన నాని, మళ్లీ ఇప్పుడు పవన్ కల్యాణ్ కి సుద్దులు చెబుతూ తెరపైకి వచ్చారు. పవన్ కల్యాణ్ నా మాట విను నీకే మంచిది అంటున్నారు నాని. ఆయన్ను నేరుగా కలసి కొన్ని విషయాలు చెబుదామనుకున్నానని, కానీ కుదర్లేదని, ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదని.. అందుకే మీడియా ముందు బహిరంగంగా చెబుతున్నానన్నారు.
వెన్నుపోటు వీరుడితో జాగ్రత్త..
చంద్రబాబు వెల్ విషర్స్ రామోజీరావు, బీఆర్ నాయుడు, ఏబీఎన్ రాధాకృష్ణ, లింగమనేని, నాదెండ్ల మనోహర్.. అంతా ఇప్పుడు పవన్ పక్కన చేరారని, వారంతా గతంలో చంద్రబాబు వల్ల లబ్ధిపొందినవాళ్లేనని గుర్తు చేశారు కొడాలి నాని. వారందరి లక్ష్యం ఒక్కటేనని, చంద్రబాబు ఎప్పుడూ సీఎంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు వాళ్లు అని అన్నారు. జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ నే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ఆయన్ని నమ్ముకుంటే పవన్ కి కూడా అదే గతి పడుతుందన్నారు. చంద్రబాబు ఎలాంటివాడో ఇప్పటికైనా తనంతట తానుగా పవన్ తెలుసుకోవాలని హితబోధ చేశారు.
ఆ పని చేస్తే ఊరుకోం..
పవన్ కల్యాణ్ వారాహియాత్రల వల్ల ఎవరికీ అభ్యంతరం లేదని, ఎన్నికలయ్యే వరకూ పవన్ రాష్ట్ర ప్రజల మధ్య తిరిగినా తమకు అభ్యంతరం లేదన్నారు నాని. అయితే చంద్రబాబు, 420 బ్యాచ్ తో కలిసి రాజకీయ దాడికి దిగితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. చంద్రబాబును సపోర్ట్ చేసే ఎవరినైనా రాజకీయంగా బట్టలూడదీసి రోడ్డుమీద నిలబెడతామన్నారు.
అప్పుడెందుకు పూర్తి చేయలేదు..?
ప్రాజెక్ట్ ల పేరుతో హడావిడి చేస్తున్న చంద్రబాబు, తాను అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని నిలదీశారు కొడాలి నాని. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చంద్రబాబు ఉన్నారని, 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా ఉన్నారని, ఆ కాలంలో సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోయారని నిలదీశారు. పోలవరానికి జాతీయ హోదా తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్ ది అని గుర్తు చేశారు. పోలవరం కాల్వలు తవ్వుతుంటే కోర్టుల్లో కేసులు వేయించిన నీఛ చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయలేని చంద్రబాబు, తాను లేస్తే మనిషిని కాదని సొల్లు కబుర్లు చెబుతుంటారని ఎద్దేవా చేశారు కొడాలి నాని. నారా లోకేష్ పిచ్చివాగుడు వాగితే చూస్తూ ఊరుకేనది లేదని హెచ్చరించారు.