అప్పటి వరకు నేను భూమిమీదే ఉంటా -కొడాలి నాని
కొడాలి నాని మీడియా ముందుకొచ్చారు. తాను అనారోగ్యానికి గురయ్యాననే వార్తల్ని ఆయన ఖండించారు. చంద్రబాబుని రాజకీయాల నుంచి, రాష్ట్రం నుంచి ఇంటికి పంపే వరకు తాను భూమి మీదే ఉంటానన్నారు నాని.
సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. శునకానందం కోసం కొంతమంది ఇలాంటి వార్తలిస్తున్నారని దయ్యబట్టారు. టీడీపీ దిగజారుడు తనానికి ఇది పరాకాష్ట అన్నారు. ఐటీడీపీ నుంచి ఇలాంటి తప్పుడు వార్తల్ని బయటపెడుతుంటారని, ఆ తర్వాత చంద్రబాబు అనుకూల మీడియా హైలెట్ చేస్తుందని, ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందన్నారు.
కొడాలి నాని తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆయన కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారని, ఆస్పత్రిలో ఉన్న కారణంగా ఆయన మీడియా ముందుకు రాలేకపోతున్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే కొడాలి నాని అభిమానులు, గుడివాడ వైసీపీ నేతలు వెంటనే ఈ వార్తల్ని ఖండించారు. ఆ తర్వాత నేరుగా కొడాలి నాని కూడా మీడియా ముందుకొచ్చారు. తాను అనారోగ్యానికి గురయ్యాననే వార్తల్ని ఆయన ఖండించారు. చంద్రబాబుని రాజకీయాల నుంచి, రాష్ట్రం నుంచి ఇంటికి పంపే వరకు తాను భూమి మీదే ఉంటానన్నారు నాని.
చంద్రబాబుని రాజకీయాల నుంచి చరమ గీతం పాడేంత వరకూ నేను ఈ భూమ్మీదే ఉంటా..#KodaliNani pic.twitter.com/HhdqlV1JkX
— Kodali Nani (@IamKodaliNani) July 11, 2023
వాళ్లందర్నీ అక్కడకు చేరుస్తా..
2024 ఎన్నికల తర్వాత ఏపీలో మానసిక వైకల్య కేంద్రం తెరుస్తామని.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, సహా.. వారి అనుకూల మీడియా సంస్థల యజమానుల్ని కూడా అక్కడ చేరుస్తామని చెప్పారు కొడాలి నాని. వారందరికోసం మానసిక వైకల్య కేంద్రం తెరవాలని తాను సీఎం జగన్ కి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. దమ్ముంటే గుడివాడలో తనపై పోటీకి దిగాలని చంద్రబాబు, లోకేష్ కు సవాలు చేసినా వారు స్పందించడం లేదన్నారు నాని. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాల వల్ల తనకేం కాదన్నారు నాని.