Telugu Global
Andhra Pradesh

ఆయన్ను నేను పకోడీ అనలేదు.. చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని

తాను చిరంజీవినే పకోడీ అన్నానంటూ కొంతమంది పెడర్థాలు తీశారని వివరించారు కొడాలి నాని. తాను పకోడీ అన్నది చిరంజీవిని కాదని, ఇండస్ట్రీలో డ్యాన్స్ లు చేయడం, డైలాగులు చెప్పడం రాని వారిని అని వివరించారు నాని.

ఆయన్ను నేను పకోడీ అనలేదు.. చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని
X

ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీతో సంబంధం లేకపోయినా చిరంజీవి అభిమానులు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలామంది మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మాత్రం చిరంజీవి బర్త్ డే కేక్ కట్ చేసి ఆయన అభిమానులకు తినిపించారు.

కొడాలి మెగాభిమానం ఏంటి..?

కొడాలి నానికి నందమూరి కుటుంబంపై అభిమానం ఉందనే విషయం అందరికీ తెలుసు. చంద్రబాబుని, లోకేష్ ని చెడామడా తిట్టినా నందమూరి కుటుంబాన్ని మాత్రం పల్లెత్తుమాట అనరు నాని. అయితే మెగా కుటుంబం విషయంలో ఆయనకు పట్టింపులు లేవు. జగన్ ని విమర్శిస్తే పవన్ కల్యాణ్ సహా అందరికీ చాకిరేవు పెట్టేస్తారు. అలాంటి నాని.. చిరంజీవికి మాత్రం మినహాయింపు ఉంటుందన్నారు. మెగాస్టార్ ని తానెప్పుడూ ఏమీ అనలేదని, ఒకవేళ అంటే తన చుట్టూ ఉన్న మెగా అభిమానులు బాధపడతారు కదా అని చెప్పారు. తన అనుచరుల్లో కూడా మెగాస్టార్ అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చారు. అందుకే తాను ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశానన్నారు.

పకోడీ వ్యాఖ్యలపై స్పందన..

ఆమధ్య చిరంజీవి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటూ బ్రో సినిమా వివాదంపై స్పందించిన విషయం తెలిసిందే. అప్పట్లో కొడాలి నాని కూడా చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు. "మాకు చెప్పే బదులు, సినీ ఇండస్ట్రీలో పకోడీగాళ్లు ఉన్నారు, ముందు వారికి చెప్పండి." అంటూ సెటైర్లు పేల్చారు. అయితే తాను చిరంజీవినే పకోడీ అన్నానంటూ కొంతమంది పెడర్థాలు తీశారని వివరించారు కొడాలి నాని. తాను పకోడీ అన్నది చిరంజీవిని కాదని, ఇండస్ట్రీలో డ్యాన్స్ లు చేయడం, డైలాగులు చెప్పడం రాని వారిని అని వివరించారు నాని.


First Published:  22 Aug 2023 2:49 PM IST
Next Story