ఆ మాట చెప్పిస్తే.. రాజకీయాలు మానేస్తా - చంద్రబాబుకు నాని సవాల్
జగన్ కట్టించిన టిడ్కో ఇళ్లకు 3 లక్షల రుణం ఉందని.. అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు నాని. జగన్ పాలన దేశ చరిత్రలోనే ఓ రికార్డు అన్నారు.
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం నేతలకు సవాల్ విసిరారు. అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదు.. ఇళ్ల స్థలాలు రాలేదని ఏ ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ చేశారు.
గుడివాడలో మేము లబ్ధిదారులం అయినా మాకు ఇల్లు రాలేదని ఒక్కరితో చెప్పించినా నేను పోటీ చెయ్యను - కొడాలి నాని pic.twitter.com/H6XjXLvyib
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2024
పేదల ఇళ్ల స్థలాల అప్పును రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్‌ది అన్నారు నాని. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో అప్పు రద్దుచేసి.. పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలను పూర్తిగా వదిలేస్తానని సవాల్ చేశారు. చంద్రబాబు పాలనలో కనీసం లోన్లు కూడా ఇవ్వలేదన్నారు నాని. జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తామని కొడాలి నాని హామీ ఇచ్చారు. వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా రుణాలన్నీ రద్దు చేపించే బాధ్యత తనది అని చెప్పారు కొడాలి.
జగన్ కట్టించిన టిడ్కో ఇళ్లకు 3 లక్షల రుణం ఉందని.. అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు నాని. జగన్ పాలన దేశ చరిత్రలోనే ఓ రికార్డు అన్నారు. జగన్ పాలన సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందించడాన్ని తాను గర్వంగా భావిస్తున్నానని చెప్పారు.