లోకేష్ కి పోటీగా బైరెడ్డి.. కొడాలి కొత్త లాజిక్
“లోకేష్ యువగళానికి పోటీగా బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిని పంపుతాం, యువగళం సభకంటే బైరెడ్డి సభకు 10రెట్లు ఎక్కువగా యువత రాకుంటే నేను రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలగుతా” అని కొడాలి నాని సవాల్ విసిరారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అంటూ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఆయన యాత్రకు జనాలు రావట్లేదని, యువత అస్సలు అటువైపు చూడట్లేదని చెప్పారు. తమ పార్టీనుంచి యువ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి యాత్ర చేస్తే నారా లోకేష్ యాత్రకంటే ఎక్కువమంది జనాలు వస్తారని అన్నారు. “లోకేష్ యువగళానికి పోటీగా బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిని పంపుతాం, యువగళం సభకంటే బైరెడ్డి సభకు 10రెట్లు ఎక్కువగా యువత రాకుంటే నేను రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలగుతా” అని కొడాలి నాని సవాల్ విసిరారు. గుడివాడలో వైసీపీ జిల్లా యువజన విభాగం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డితో కలసి కొడాలి నాని పాల్గొన్నారు.
చంద్రబాబు, లోకేష్ కి గన్నవరం, గుడివాడ..
దమ్ముంటే చంద్రబాబు, లోకేష్.. గన్నవరం, గుడివాడ వచ్చి పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు కొడాలి నాని. కుప్పంని నమ్ముకున్న చంద్రబాబు ఈసారి అక్కడ కూడా గెలవలేరన్నారు. వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోతోందంటున్న బాబు, ప్రజా తీర్పుపై అంత నమ్మకం ఉంటే గుడివాడ, గన్నవరం.. ఈ రెండిటిలో ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలని, మరొక చోట కొడుక లోకేష్ ని పోటీకి దింపాలన్నారు. చిత్తుచిత్తుగా ఓడించి పంపుతామంటూ సవాల్ విసిరారు.
పోటీ సభ ఎక్కడైనా పెట్టగలరా..?
ఏపీలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ సభలకు పోటీగా టీడీపీ ఎక్కడైనా సభ పెట్టగలదా, జన సమీకరణ చేయగలదా అని ప్రశ్నించారు కొడాలి నాని. 175 నియోజకవర్గాల్లో ఎక్కడా టీడీపీకి ఆ దమ్ము లేదన్నారు. జగన్ నిలబెట్టిన అభ్యర్థి చేతులో చిత్తు చిత్తుగా ఓడిపోయిన లోకేష్.. జగన్ కే సవాల్ విసరడం హాస్యాస్పదం అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఫ్లాప్ షో అన్నారు నాని.