Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్ కి పార్టీ ఇచ్చి పక్కకెళ్లిపోండి..

తమ విశ్వసనీయతపై తమకే నమ్మకం లేక, జూనియర్ ఎన్టీఆర్ ని లోకేష్ ఆహ్వానించారని చెప్పారు నాని. పార్టీ బాధ్యతలు జూనియర్ కు అప్పజెబితే టీడీపీ ప్రతిపక్షంలోనైనా ఉంటుందన్నారు.

ఎన్టీఆర్ కి పార్టీ ఇచ్చి పక్కకెళ్లిపోండి..
X

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కి ఎదురైన ఓ ప్రశ్న, దానికి ఆయన ఇచ్చిన సమాధానం ప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి కచ్చితంగా ఆహ్వానిస్తానంటూ నారా లోకేష్ చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అసలు ఎన్టీఆర్ తాత పెట్టిన తెలుగుదేశం పార్టీలోకి ఆయన మనవడు ఎన్టీఆర్ ని ఆహ్వానించడమేంటని ప్రశ్నించారు మంత్రి కొడాలి నాని. సీనియర్ ఎన్టీఆర్ పేరు పది కాలాల పాటు వినిపించాలంటే పార్టీ బాధ్యతలు జూనియర్ కు అప్పగించాలన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను లోకేష్ ఆహ్వానించడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ కు నిశ్వసనీయత లేదని, పార్టీని కాపాడటం తమ వల్ల కాదని చంద్రబాబు, లోకేష్ కు అర్థమైందని, అందుకే వారు పక్కకు తప్పుకోవాలని సూచించారు కొడాలి నాని.

తమ విశ్వసనీయతపై తమకే నమ్మకం లేక, జూనియర్ ఎన్టీఆర్ ని లోకేష్ ఆహ్వానించారని చెప్పారు నాని. పార్టీ బాధ్యతలు జూనియర్ కు అప్పజెబితే టీడీపీ ప్రతిపక్షంలోనైనా ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఊబి లాంటిదని, ఆ పార్టీని కాపాడేందుకు ఎవరెళ్లినా కూరుకుపోవడం ఖాయమని అన్నారు. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం పామర్రు, చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి, లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో టీడీపీని గెలిపించలేని వారు, పార్టీని ఎలా నడిపిస్తారన్నారు. మార్పు కావాల్సింది రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజల్లో కాదని, టీడీపీలో అని అన్నారు.

లోకేష్ కంటే బ్రాహ్మణి బెటర్..

గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ కంటే, ఆయన భార్య బ్రాహ్మణి పోటీ చేసి ఉంటే గెలిచి ఉండేవారని అన్నారు కొడాలి నాని. లోకేష్ తరపున బ్రాహ్మణి ప్రచారం చేసినా ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. లోకేష్ కు విశ్వసనీయత లేదని, గతంలో ఎన్టీఆర్ ని వాడుకుని ఆ తర్వాత ఎలా అవమానించారో ఆయనకు కూడా తెలుసని చెప్పారు. 2009 తర్వాత జరిగిన మాహానాడులో లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని అవమానించారన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచాక ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమంలో జూనియర్ ను గ్యాలరీలో కూర్చొబెట్టి అవమానించారని చెప్పారు. చంద్రబాబు ఎలాంటి వాడో తన తాత, తండ్రి, మేనత్తలు జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పి ఉంటారని, చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో స్వయంగా జూనియర్ ఫేస్ చేశారని అన్నారు నాని.

First Published:  25 Feb 2023 2:28 PM IST
Next Story