నాకు జూనియర్ ఎన్టీఆర్ సీటు ఇప్పించారు - ఎమ్మెల్యే కొడాలి నాని
తెలుగుదేశం పార్టీలో తనకు సీటు ఇచ్చింది ఎన్టీఆర్ మాత్రమేనని, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తనకు సీటు ఇప్పించారని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ తనకు సీటు ఇప్పించారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వెల్లడించారు. గురువారం గుడివాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వాసం లేని కుక్క అంటూ ఇటీవల విజయవాడలో టీడీపీ నేతలు దూషించడంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు సీటు ఇస్తే.. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. ఆయనపైనే దూషణలకు దిగుతున్నాడని చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీలో తనకు సీటు ఇచ్చింది ఎన్టీఆర్ మాత్రమేనని, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తనకు సీటు ఇప్పించారని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాను ఎన్టీఆర్‌కి, హరికృష్ణకి మాత్రమే రుణపడి ఉన్నానని కొడాలి నాని చెప్పారు. అందుకే ఆయన చనిపోయినప్పుడు అంతిమ యాత్రలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు స్పల్ప విభేదాలు ఉన్నప్పటికీ, ఆయన్ని ఎప్పుడూ దూషించలేదని ఆయన తెలిపారు. చంద్రబాబు అమరావతి రైతుల ముసుగులో టీడీపీ నేతలతో జూనియర్ ఎన్టీఆర్‌ని తిట్టిస్తున్నాడని కొడాలి నాని మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్ ఆడుతున్న నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారని నాని చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పాదయాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టాలని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఇస్తే.. ఆయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. బాబును నమ్మడమే ఎన్టీఆర్ చేసిన తప్పని ఆయన చెప్పారు. చంద్రబాబుకు ఏమాత్రం విశ్వాసం లేదని ఆయన స్పష్టం చేశారు. తోడు కోసమే ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారని, ఆమెకు ఎలాంటి పదవీ ఇవ్వలేదని గుర్తు చేశారు.