పీకే బుర్రలో గుజ్జు లేదు.. మేం పూర్తిగా వాడేశాం
బాబాయ్ ను చంపడానికి పీకేనే ప్లాన్ చేశారని, జనాన్ని రెచ్చగొట్టడానికే కోడికత్తితో పొడిపించుకున్నారని అప్పుడు విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపుకోసం ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో పీక కోయించుకుంటారా? అని ప్రశ్నించారు కొడాలి నాని.
ఐప్యాక్ తో ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ప్రశాంత్ కిషోర్ ని తాము ఇప్పటికే పూర్తిగా వాడేశామని, పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయిందని సెటైర్లు పేల్చారు. వైసీపీ, పీకేను వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు బీహార్ నుంచి వచ్చినోడు ఏం పీకుతాడని చంద్రబాబు వెటకారం చేశారని, ఇప్పుడు ఎల్లో బ్యాచ్ చేస్తున్నదేంటని సూటిగా ప్రశ్నించారు. మనకంటే గొప్పోళ్లు ప్రపంచంలో ఎవడైనా ఉన్నారా తమ్ముళ్లూ అన్న చంద్రబాబు.. ఇప్పుడు పీకేతో రాజకీయ పాఠాలు చెప్పించుకోవడం విడ్డూరమన్నారు.
చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని అన్నారు కొడాలి నాని. ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా? అని ప్రశ్నించారు. ఎంత మంది పీకేలను తెచ్చి పెట్టుకున్నా.. జగన్ ని చంద్రబాబు ఏమీ చేయలేరన్నారు. చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని కౌంటర్ ఇచ్చారు.
అసలు కారణం ఇదే..
ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకే చంద్రబాబును పీకే కలిశారని అన్నారు కొడాలి నాని. బాబాయ్ ను చంపడానికి పీకేనే ప్లాన్ చేశారని, జనాన్ని రెచ్చగొట్టడానికే కోడికత్తితో పొడిపించుకున్నారని అప్పుడు విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపుకోసం ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో పీక కోయించుకుంటారా? అని ప్రశ్నించారు.
అటు పీకే ఇటు పీకే..
చంద్రబాబు ఒకవైపు పవన్ కల్యాణ్ ను పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నారని, మరోవైపు ప్రశాంత్ కిషోర్ ని పెట్టి కాంగ్రెస్ తో చర్చలకు తెరలేపారని అన్నారు కొడాలి నాని. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ వస్తుందో లేక కాంగ్రెస్ వస్తుందో తెలియక ఆయన ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు.