Telugu Global
Andhra Pradesh

కొడాలి నానికి కొత్త తలనొప్పి.. గుడివాడ పేరు జపిస్తున్న రేణుకా చౌదరి

రెండు సార్లు టీడీపీ టికెట్‌పై గెలిచిన నాని..మరో రెండు సార్లు వైసీపీ నుంచి గెలుపొందారు. గుడివాడ నియోజకవర్గంలో తనకు ఎదురే లేకుండా చేసుకున్నారు.

కొడాలి నానికి కొత్త తలనొప్పి.. గుడివాడ పేరు జపిస్తున్న రేణుకా చౌదరి
X

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తెలిసిన అందరికీ సుపరిచితమే. వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీకి చెందిన ఎవరు మాట తూలినా.. కొడాలి నాని సీన్‌లోకి వచ్చేస్తారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లను టార్గెట్ చేయడంలో నాని ముందుంటారు. రెండున్నర ఏళ్ల తర్వాత.. మంత్రి పదవి పోయిన చాలా మంది సైలెంట్ అయిపోయారు. కానీ కొడాలి నానిలో మాత్రం దూకుడు తగ్గకపోగా మరింతగా పెరిగింది. ఇటీవల నారా లోకేశ్ పాదయాత్ర టార్గెట్‌గా నాని వేసిన సెటైర్లు మీడియాలో మార్మోగిపోయాయి.

గుడివాడ నుంచి 2004 నుంచి వరుసగా కొడాలి నాని గెలుస్తూ వస్తున్నారు. రెండు సార్లు టీడీపీ టికెట్‌పై గెలిచిన నాని..మరో రెండు సార్లు వైసీపీ నుంచి గెలుపొందారు. గుడివాడ నియోజకవర్గంలో తనకు ఎదురే లేకుండా చేసుకున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు నానికి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండేవారు. అయితే వైసీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ అతడికి ప్రధాన ప్రత్యర్థిగా మారిపోయింది. రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీపైనే నాని గెలుస్తూ వస్తుండటం ఆ పార్టీ నాయకులకు రుచించడం లేదు. పైగా చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తుండటంతో నాని ఓటమి కోసం గత రెండు దఫాలుగా విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు.

రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని గుడివాడ తెలుగు తమ్ముళ్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అధినేత చంద్రబాబు కూడా నానిని ఈ సారి అసెంబ్లీ గడప తొక్కనివ్వొద్దని కంకణం కట్టుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. అందుకే బలమైన అభ్యర్థులను వెతుకుతున్నారు. 2014లో రావి వెంకటేశ్వరరావు 11 వేల మెజార్టీతో ఓడిపోయారు. ఇలా కాదని 2019లో దేవినేని అవినాశ్‌ను బరిలోకి దింపగా.. ఆయన దాదాపు 20వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలా కాదని చంద్రబాబు ఈ సారి రాము అనే ఎన్ఆర్ఐని బరిలోకి దింపాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే రాము నియోజకవర్గంలో తిరుగుతూ హడావిడి చేస్తున్నారు. జనసేనతో పొత్తు ఉంటే నానిని ఈజీగా ఓడించొచ్చని భావిస్తున్నారు.

టీడీపీ తరపున బరిలో ఉంటాడని అంచనా వేస్తున్న రాము కాస్త దూకుడుగా ఉండటంతో నాని కూడా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇప్పుడు కొడాలి నానికి కొత్త రూపంలో తలనొప్పి స్టార్ట్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి గుడివాడ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. గతంలో ఖమ్మం ఎంపీగా పని చేసిన రేణుక.. ఈ సారి అసెంబ్లీకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఖమ్మం లేదా గుడివాడ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు.

తెలంగాణ నుంచి రాజకీయం చేసిన రేణుకా చౌదరి.. ఈ సారి ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. అదే జరిగితే గుడివాడలో ఈ సారి త్రిముఖ పోటీ ఖాయమే. అదే జరిగితే కొడాలి నాని ఈ సారి ఇద్దరు నేతలపై పోటీకి దిగాల్సి వస్తోంది. ఇది ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, త్రిముఖ పోటీ ఉంటే అది నానికే కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేదు. ఆ క్యాడర్ కూడా చాలా మంది వైసీపీలో చేరిపోయారు. రెండు దశాబ్దాలుగా గుడివాడలో తిరుగే లేని నాయకుడిగా ఉన్న నానికి ఈ సారి టీడీపీ, జనసేన కలిస్తే తిప్పలు తప్పవని అనుకున్నారు. అయితే, రేణుకా చౌదరి కనుక బరిలో నిలిస్తే వ్యతిరేక ఓటు భారీగా చీలిపోయి అది నానికే అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.మొత్తానికి రేణుకా చౌదరి వస్తే గుడివాడ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  7 Feb 2023 7:28 AM IST
Next Story