పేదల ఆత్మగౌరవాన్ని మళ్లీ రోడ్డున పడేశారు.. - కొడాలి నాని ఫైర్
ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం కార్యాలయాలకు వెళ్లి గంటలకొద్దీ నిలబడటమనేది ఇప్పుడు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆత్మగౌరవ సమస్య అని ఆయన తెలిపారు.
పేద వర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డుపాలు చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనల వల్లే వలంటీర్లు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారని ఆయన చెప్పారు. గురువారం కొడాలి నాని విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడని ఆయన మండిపడ్డారు. కూటమి పార్టీల నేతలకు, పచ్చ మీడియా పెద్దలకే గౌరవ మర్యాదలు, ఆత్మగౌరవం ఉంటాయా? పేదలకు ఉండదా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
ఆ రోజులను వృద్ధులు ఎప్పుడో మర్చిపోయారు..
క్యూలైన్‌లో నిలబడి పెన్షన్ తీసుకునే రోజులను వృద్ధులు ఎప్పుడో మర్చిపోయారని నాని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం కార్యాలయాలకు వెళ్లి గంటలకొద్దీ నిలబడటమనేది ఇప్పుడు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆత్మగౌరవ సమస్య అని ఆయన తెలిపారు. ప్రభుత్వం బాధ్యతగా ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వడంతో హక్కుగా లబ్ధిదారులు ఇప్పటివరకు అందుకుంటున్నారని ఆయన చెప్పారు. పేదవాళ్లు కోరుకునే ఆత్మగౌరవం దెబ్బతినకుండా మూడో కంటికి తెలియకుండా ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ సాయం అందిస్తున్నామని కొడాలి నాని తెలిపారు.