Telugu Global
Andhra Pradesh

రాహుల్ వ్యవహారంలో వైసీపీ మౌనం.. కొడాలి నాని వివరణ

కాంగ్రెస్ చేసిన పాపానికి.. ప్రజలు, దేవుడు వేసిన శిక్ష అది అంటూ మండిపడ్డారు కొడాలి నాని. జగన్ పై అక్రమ కేసులు పెడితే ఆనాడు కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

రాహుల్ వ్యవహారంలో వైసీపీ మౌనం.. కొడాలి నాని వివరణ
X

రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారంలో దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రజాస్వామ్యంపై దాడి అంటూ పార్లమెంట్ లో రచ్చ రచ్చ చేశాయి. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు మినహా తటస్థులు కూడా ఆ వ్యవహారంపై మండిపడ్డారు. కొన్ని పార్టీల నేతలు కాంగ్రెస్ నేతలతో కలసి పార్లమెంట్ కి నల్ల దుస్తుల్లో వెళ్లి మరీ నిరసన తెలిపారు. ఈ వ్యవహారంలో స్పందించని ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఏపీలో వైసీపీ, టీడీపీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములు కావు, కనీసం అధికారం పంచుకోని మిత్రపక్షాలు కూడా కావు. కానీ విచిత్రంగా వైసీపీ, టీడీపీ నుంచి బీజేపీపై పల్లెత్తు మాట ఎవరూ జారలేదు. రాహుల్ ని సమర్థించకపోయినా పర్వాలేదు, బీజేపీ రియాక్షన్ ని అయినా ఖండించాలి కదా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపించాయి. కానీ ఆ రెండు పార్టీలు మౌనాన్నే ఆశ్రయించాయి. తాజాగా ఆ మౌనాన్ని బద్దలు కొట్టారు కొడాలి నాని. తమ పార్టీ ఎంపీలు కానీ, నేతలు కానీ రాహుల్ వ్యవహారంలో ఎందుకు స్పందించలేదు అనే విషయాన్ని నాని వివరించారు.

ఆ కోపం అలాగే ఉంది..

కాంగ్రెస్ చేసిన పాపానికి.. ప్రజలు, దేవుడు వేసిన శిక్ష అది అంటూ మండిపడ్డారు కొడాలి నాని. జగన్ పై అక్రమ కేసులు పెడితే ఆనాడు కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏపీ నుంచి కేవీపీ రామచంద్రరావు స్పందించారని, తమ ఎంపీలకు అంతకంటే ముఖ్యమైన పనులున్నాయని అన్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టం ప్రకారమే రాహుల్ అనర్హతకు గురయ్యారని, దానిపై ప్రశ్నించడం దేనికన్నారు.

నారావారంతా దొంగలేనా..?

నారా చంద్రబాబు దొంగ, లోకేష్ దొంక కావొచ్చు కానీ.. నారా వారంతా దొంగలేనంటూ ఎవరైనా మాట్లాడితే.. ఆ ఇంటిపేరు కలిగినవారెవరైనా కేసు వేయొచ్చని, రాహుల్ గాంధీ విషయంలో కూడా అదే జరిగిందని చెప్పుకొచ్చారు నాని. మా ముత్తాత ప్రధాని, మా నాయనమ్మ ప్రధాని.. అంటే కుదరదని చట్టం తన పని తాను చేసుకు పోయిందన్నారు. వయనాడ్ కి రాహుల్ గాంధీ విజిటింగ్ ఎంపీయే కదా అంటూ ఎద్దేవా చేశారు. ఏడాదిలో ఎలాగూ ఎన్నికలు వస్తాయి కదా.. పదవి పోయిందంటూ ఈ రచ్చ దేనికన్నారు. మొత్తమ్మీద.. ఆనాడు కాంగ్రెస్, జగన్ కి చేసిన అన్యాయం విషయంలో ఆ పార్టీ అన్నా, ఆ పార్టీ నేతలన్నా.. ఇప్పటికీ వైసీపీ గుర్రుగానే ఉంది.

First Published:  29 March 2023 10:51 PM IST
Next Story