Telugu Global
Andhra Pradesh

బీఆర్ఎస్ ఎంట్రీతో వైసీపీ ఉలికిపాటు, కొడాలి వ్యాఖ్యల మర్మం అదే..!

విభజన వల్ల కోస్తా ప్రాంతం నష్టపోయిందనుకుంటే.. ఈ ఎనిమిదేళ్లలో ఎంతవరకు ఏపీ కోలుకుంది. గత పాలకులు ఏం చేశారు, ఈ పాలకుల చేతిలో ఎంతవరకు ఏపీ అభివృద్ధి చెందింది.? అనే ప్రశ్నలకు కూడా ఏపీ నాయకులు సమాధానం చెప్పాలి.

Kodali Nani
X

కొడాలి నాని

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో తొలిదెబ్బ జనసేనపై పడుతోంది. జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. బీజేపీనుంచి కూడా వలసలున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి ఏంటి. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాకూడా నేతల వలసలపై అధినాయకత్వాలకు గుబులు పట్టుకుంది. అందుకే మెల్లగా వైసీపీ తరపున గొంతు సవరించుకున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండబోదన్నారు.

కేసీఆర్ పై ఏపీలో వ్యతిరేక ఉందా..?

రాష్ట్ర విభజనను ఏపీలోని కొంతమంది వ్యతిరేకించారు కానీ, విభజన తర్వాత తొందరగానే ఆ గాయం మానిపోయింది. అందుకే హైదరాబాద్ లో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయాలు సొంతం చేసుకుంది. కేసీఆర్ ని అంతగా అభిమానించారు, అభిమానిస్తూనే ఉన్నారు ఆంధ్ర ప్రాంత వాసులు. సడన్ గా ఇప్పుడు కేసీఆర్ పై, బీఆర్ఎస్ పై ఏపీ వాసులకు కోపం ఉందని సెలవిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. బీఆర్ఎస్‌ వల్లే నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారన్నారాయన. ఏపీ రాజకీయాలపై బీఆర్ఎస్‌ పార్టీ ప్రభావం శూన్యమని తేల్చేశారు. అయితే, జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయవచ్చని చెప్పారు.

విభజనతో నష్టం జరిగితే ఆ తర్వాత జరిగిందేంటి..?

విభజన వల్ల కోస్తా ప్రాంతం నష్టపోయిందని అనుకుంటే.. ఈ ఎనిమిదేళ్లలో ఎంతవరకు ఏపీ కోలుకుంది. గత పాలకులు ఏం చేశారు, ఈ పాలకుల చేతిలో ఎంతవరకు ఏపీ అభివృద్ధి చెందింది.? అనే ప్రశ్నలకు కూడా ఏపీ నాయకులు సమాధానం చెప్పాలి. అక్కడ మిషన్ భగీరథ పూర్తయింది, ఇక్కడ పోలవరం కునారిల్లుతోంది. అక్కడ ఐటీ హబ్ లు ఏర్పాటవుతున్నాయి, ఇక్కడ ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నాయి. సంక్షేమ పథకాలను లెక్కలో వేసుకున్నా.. దళితబంధు వంటి చారిత్రక పథకాలకు ఏపీలో చోటే లేదు. రాష్ట్రాలు వేరుపడ్డాక ఇన్ని అసమానతలున్నా కూడా ఇంకా ఏపీని బీఆర్ఎస్ మోసం చేసిందని చెప్పడంలో కొడాలి వ్యూహం స్పష్టంగా తెలుస్తోంది.

మొత్తమ్మీద బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలోని పార్టీల్లో వణుకు మొదలైందనేది మాత్రం వాస్తవం. అన్ని పార్టీల్లో అసంతృప్తులు ఉన్నారు, వారందరికీ బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అయితే మాత్రం కచ్చితంగా అది సంచలనం అవుతుంది. 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తే.. 175కి 175 అని కలలు కంటున్న వైసీపీకి చుక్కలు కనిపించడం ఖాయం. అందుకే ముందుగానే కొడాలి నాని వంటి నేతలతో వ్యూహాత్మక దాడి మొదలు పెట్టింది వైసీపీ. బీఆర్ఎస్ వల్ల ఏపీ నష్టపోయిందనే ప్రచారం చేయిస్తోంది.

First Published:  2 Jan 2023 2:51 PM IST
Next Story