విశాఖ రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్.. -ఒడిశా దంపతులపై అనుమానం
ఒడిశాకు చెందిన ఒక జంట ఆమెతో పరిచయం చేసుకొని మాటలు కలిపారు. తరువాత తన పక్కనే బిడ్డను పడుకోబెట్టుకున్న భవానీ నిద్రలోకి జారుకుంది. కొంత సమయం తరువాత లేచి చూసేసరికి బిడ్డ కనిపించలేదు.
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో 18 నెలల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో నిందితులు ఒడిశాకు చెందిన దంపతులని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిగా ఉన్న ఆమె బిడ్డ ఆచూకీ కోసం తల్లడిల్లిపోతోంది.
భర్త వేధింపులకు భయపడి..
విశాఖ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిడ్నాప్‌నకు గురైన బాలుడి తల్లి కొంగర భవానీది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కాప్రాయపల్లి. భర్త వేధింపుల నేపథ్యంలో బిడ్డని ఏమైనా చేస్తారేమోనని భయపడి ఇల్లు విడిచి వెళ్లిపోవాలని భావించి రైలెక్కింది. బుధవారం సాయంత్రం విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక బుధవారం రాత్రంతా ప్లాట్‌ఫాంపైనే ఉండిపోయింది.
పరిచయం చేసుకొని.. మాటలు కలిపి..
గురువారం తెల్లవారుజామున ఒడిశాకు చెందిన ఒక జంట ఆమెతో పరిచయం చేసుకొని మాటలు కలిపారు. తరువాత తన పక్కనే బిడ్డను పడుకోబెట్టుకున్న భవానీ నిద్రలోకి జారుకుంది. కొంత సమయం తరువాత లేచి చూసేసరికి బిడ్డ కనిపించలేదు. ఒడిశా జంట కూడా కనిపించలేదు. దీంతో స్టేషన్ లోని జీఆర్పీ పోలీసులను ఆమె ఆశ్రయించింది. హుటాహుటిన తనిఖీలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. భవానీ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పోలీసులు కేజీహెచ్ కు తరలించారు.