Telugu Global
Andhra Pradesh

కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు.. కక్షసాధింపు చర్యలేనా..?

తన ఇంటికి వచ్చి కోటంరెడ్డి వార్నింగ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు విజయభాస్కర్ రెడ్డి. ఆయన ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు పెట్టారు.

కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు.. కక్షసాధింపు చర్యలేనా..?
X

నాపై కేసులు పెడతారా, నన్ను అరెస్ట్ చేస్తారా..? ఎప్పుడు చేస్తారో చేసుకోండి, ఏమేం కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్నాళ్లు జైలులో పెడతారో మీ ఇష్టం అంటూ.. నిన్న ఉదయం కోటంరెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు. సీన్ కట్ చేస్తే సాయంత్రానికి ఆయనపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇవన్నీ కక్షసాధింపు చర్యలేనంటోంది కోటంరెడ్డి వర్గం. తమ వైపు ఉన్న కార్పొరేటర్లపై కొంతమంది నాయకులు ఒత్తిడి తెస్తున్నారని, వారిని ఆదాలవైపు వచ్చేలా బెదిరిస్తున్నారని అంటున్నారు కోటంరెడ్డి వర్గం నేతలు.

నెల్లూరు నగర కార్పొరేషన్ కి సంబంధించి రూరల్ నియోజకవర్గ పరిధిలో 26మంది కార్పొరేటర్లు ఉండగా, వారిలో 24మంది ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే ఉన్నారు, ఇద్దరు ఆదాల గ్రూపులో చేరిపోయారు. ఈ నేపథ్యంలో 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి, తనను కోటంరెడ్డి బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తన ఇంటికి వచ్చి కోటంరెడ్డి వార్నింగ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు విజయభాస్కర్ రెడ్డి. ఆయన ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు పెట్టారు.

ఎవరు, ఎటు వైపు..?

నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో రూరల్ పరిధిలో కోటంరెడ్డి తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు. గెలిచిన కార్పొరేటర్లంతా కోటంరెడ్డివైపే ఉంటారనుకున్నారు. కానీ ఇప్పటికే ఇద్దరు చేజారారు. మిగతావారిపై కూడా పార్టీనుంచి ఒత్తిడి ఉంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడితే భవిష్యత్తులో పార్టీ వారి సేవలను గుర్తిస్తుందని పరోక్షంగా హింటిచ్చారు మంత్రి కాకాణి. రూరల్ లో ఆదాల గడప గడప కార్యక్రమం మొదలుపెట్టేనాటికి కార్పొరేటర్లలో కొంతమందనయినా ఆవైపు తిప్పుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రూరల్ లో ఆధిపత్యపోరు మొదలైంది. కోటంరెడ్డి వర్గం ఒత్తిడి ఓవైపు, వైసీపీ నేతల ఒత్తిడి మరోవైపు.. ఇలా కార్పొరేటర్లు సతమతం అవుతున్నారు.

బెదిరింపు కాల్స్..

మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్స్ కూడా మొదలయ్యాయి. కడపనుంచి ఓ వ్యక్తి కాల్ చేసి జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడితే కోటంరెడ్డిని నెల్లూరునుంచి ఈడ్చుకెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది. అయితే తాను బెదిరేది లేదంటున్నారు కోటంరెడ్డి. తానెవరికీ అన్యాయం చేయలేదని, పార్టీయే తనను అవమానించిందని చెబుతున్నారు.

First Published:  4 Feb 2023 4:19 AM GMT
Next Story