Telugu Global
Andhra Pradesh

కిరణ్ సేవలను వినియోగించుకోనున్న‌ బీజేపీ.. కర్ణాటక ఎన్నికల్లో కీలక బాధ్యతలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ బీజేపీ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశానికి నడ్డా, అమిత్ షా నేతృత్వం వహించగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప పాల్గొన్నారు. వీరితోపాటు కిరణ్ కూడా పాల్గొన్నారు.

కిరణ్ సేవలను వినియోగించుకోనున్న‌ బీజేపీ.. కర్ణాటక ఎన్నికల్లో కీలక బాధ్యతలు
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారో లేదో అప్పుడే ఆయన సేవలను పార్టీ వినియోగించడం మొదలుపెట్టింది. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం కోసం కిరణ్ రాజకీయ అనుభవాన్ని కూడా బీజేపీ వాడుకుంటోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ బీజేపీ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశానికి నడ్డా, అమిత్ షా నేతృత్వం వహించగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప పాల్గొన్నారు. వీరితోపాటు కిరణ్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతలు కర్ణాటక ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరి, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ తన వ్యాపారాలు అన్నీ బెంగళూరు కేంద్రంగానే సాగిస్తూ వచ్చారు. రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. ఆయన సొంత జిల్లా చిత్తూరు కూడా బెంగళూరుకు సమీపంలోనే ఉంటుంది. దీంతో కర్ణాటకలో చిత్తూరును ఆనుకొని ఉండే ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కోసం, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కిరణ్ సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ అగ్ర నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కిరణ్‌కు కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కొన్ని బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

ఇక కర్ణాటక ఎన్నికల విషయమై రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్లమెంటరీ బోర్డు ఖరారు చేయనున్నట్లు స‌మాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన సమావేశంలో నేతలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై మాజీ సీఎం యడ్యూరప్పతో కూడా కిరణ్ చర్చించారు. అలాగే కర్ణాటక ఎన్నికల విషయమై అగ్ర నేతలు అమిత్ షా, బీఎల్ సంతోష్‌లతో కిరణ్ చర్చలు జరిపారు. మొత్తానికి పార్టీలో చేరిన వెంటనే కిరణ్ సేవలను బీజేపీ అధిష్టానం వినియోగించుకోవడం ఆసక్తికరంగా మారింది.

First Published:  8 April 2023 6:36 PM IST
Next Story