Telugu Global
Andhra Pradesh

రెండు పార్టీల్లోను బాబు మనుషులేనా?

తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఇటు బీజేపీ అటు జనసేనలో చేరుతున్నారు. రెండు పార్టీల్లోని నేతలంతా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడినవారే.

రెండు పార్టీల్లోను బాబు మనుషులేనా?
X

ప్రతిపక్షాల్లో కాస్త ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఇటు బీజేపీ అటు జనసేనలో చేరుతున్నారు. రెండు పార్టీల్లోని నేతలంతా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడినవారే. తాజాగా మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరారు. ఈమె విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలోని చంద్రబాబుకు సన్నిహిత నేతల్లో ఈమె కూడా ఒకరు. అలాంటి అరుణ సడెన్‌గా జనసేనలో చేరటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆశ్చర్యం ఏమిటంటే గడచిన రెండేళ్ళుగా ఈమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అంటే ఒక రకంగా రాజకీయాలను వదిలేసినట్లే అనుకుంటున్నారు. అలాంటి అరుణ సడెన్‌గా జనసేనలో చేరారంటే దీనివెనుక ఏదో మర్మం ఉండే ఉంటుంది. ఈ మధ్యనే పంచకర్ల రమేష్ కూడా జనసేనలో చేరిన విషయం తెలిసిందే. పంచకర్ల కూడా చంద్రబాబుకు బాగా సన్నిహితుడే. గతంలో పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. రాబోయే ఎన్నికల్లో పెందుర్తి నుండి పోటీ చేసేందుకు టికెట్ హామీ తీసుకున్న తర్వాతే పంచకర్ల జనసేనలో చేరారు.

ముందుముందు టీడీపీ నేతలు లేదా టీడీపీ వాసనలున్న నేతలు ఇంకా ఎంతమంది జనసేనలో చేరుతారో చూడాలి. ఇక బీజేపీ సంగతి తీసుకుంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, చందు సాంబశివరావు, వరదాపురం సూరి లాంటి మరికొందరు నేతలు యాక్టివ్‌గా ఉన్నారు. వీళ్ళంతా చంద్రబాబు మనుషులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రేపటి ఎన్నికల్లో పైన చెప్పిన నేతల్లో చాలామంది రెండు పార్టీల్లోను టికెట్లు తీసుకుని పోటీ చేస్తారనటంలో సందేహం లేదు. ఒకవేళ వీళ్ళు ఓడిపోయినా లేదా టీడీపీ ఓడిపోయినా మాట్లాడిది ఏమీ ఉండదు. అదే వీళ్ళు గెలిచి అధికారానికి టీడీపీ ఆమడ దూరంలో నిలిస్తే మాత్రం తాము పోటీ చేసిన పార్టీల్లో వీళ్ళు ఉండేది అనుమానమే. రెండు పార్టీల్లోని నేతల గురించి బీజేపీ, పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసు. తెలిసినా పై పార్టీలు చేయగలిగేదేమీలేదు కాబట్టి వేరేదారిలేక వీళ్ళందరికీ టికెట్లు ఇవ్వాల్సిందే. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

First Published:  11 Aug 2023 12:00 PM IST
Next Story