ఆరు నెలల్లో వీడనున్న చెర.. పంచాయతీలకు శుభవార్త
పంచాయతీ భూములను ఆక్రమించిన వారు ఆరునెలల్లో ఆ భూములను ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. అయితే ఇందుకు నిబంధనల్ని పాటించాలని చెప్పింది. కబ్జాల నుంచి విడిపించిన భూములు మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని పంచాయతీ భూములు ఆక్రమణల చెరనుంచి విముక్తి కానున్నాయి. ఏళ్ల తరబడి ఆక్రమణలకు గురైన భూముల విషయంలో ఏమీ చేయలేక అధికారులు, పాలకులు మౌనంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పంచాయతీ, మున్సిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల్లో ఆక్రమణల్ని తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
పంచాయతీ భూములను ఆక్రమించిన వారు ఆరునెలల్లో ఆ భూములను ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. అయితే ఇందుకు నిబంధనల్ని పాటించాలని చెప్పింది. కబ్జాల నుంచి విడిపించిన భూములు మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పంచాయతీల్లో ఆక్రమణల విషయమై 2011లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా తీసుకుంది హైకోర్టు.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు అదే సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 188వ నంబరు జీవోను జారీచేసిందని గుర్తుచేసింది. ఈ జీవో ప్రకారం పంచాయతీల భూములు మూడురకాలు.
1. సొంతవి, సేకరించినవి.
2. దానంగా, విరాళంగా సమకూరినవి.
3. పంచాయతీకి చెందినవి.
ఈ భూములకు సంబంధించిన వివరాలను ఏటా రాజపత్రంలో ప్రచురించాలి. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ మూడునెలలకు ఒకసారి ఈ భూముల పరిస్థితుల్ని సమీక్షించాలి. కారణాలేవైనా పలు పంచాయతీల్లో భూములు ఆక్రమణల చెరలోనే ఉంటున్నాయి. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఇవి విముక్తి కానున్నాయి. మున్సిపాలీటీలు, అటవీ, రెవెన్యూ శాఖల భూముల ఆక్రమణలను రెండు నెలల్లో గుర్తించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆ తరువాత వాటిని చెర విడిపించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది.
పలు వ్యాజ్యాలు
ఆక్రమణలకు సంబంధించి హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వ భూములు, జలవనరులు, అటవీ భూములు, ఆటస్థలాలు.. చివరికి శ్మశానాలు కూడా కబ్జాలకు గురయ్యాయని, జీవో 188 ఉన్నా ప్రయోజనం లేకుండాపోయిందని న్యాయవాది రాజేంద్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆక్రమణలకు సంబంధించి మరికొన్ని వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వీటిపైన హైకోర్టు ధర్మాసనం విచారించింది.