పింఛన్ల పంపిణీ వలంటీర్ల ద్వారానే.. సెర్ప్ క్లారిటీ
పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని, పింఛన్లు ఇస్తున్నట్లు ఫొటోలు, వీడియోలు తీయకూడదని సెర్ఫ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పింఛన్ల పంపిణీ ఎవరు చేపడతారన్న దానిపై గందరగోళం నెలకొంది. ఎప్పటిలాగే వలంటీర్లే పింఛన్లు పంచుతారని కొందరు అంటుంటే.. కోడ్ నేపథ్యంలో వలంటీర్లను రానివ్వరని సచివాలయ ఉద్యోగులే పంచుతారని రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. అయితే వలంటీర్లే పెన్షన్లు ఇస్తారని తాజాగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) క్లారిటీ ఇచ్చింది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. సామాజిక పింఛన్ల పంపిణీకి బ్యాంకుల నుంచి నగదు తీసుకునివెళ్లే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని సెర్ఫ్ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. వీరికి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు.. ఆథరైజేషనల్ లెటర్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలలు పెన్షన్లు వారితోనే పంపిణీ చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లే. దీంతో సామాజిక పెన్షన్ల పంపిణీపై సందేహాలు కాస్త నెమ్మదించినట్లే.
కోడ్ ఉల్లంఘన కాకుండా జాగ్రత్తలు
అయితే వలంటీర్ల పెన్షన్లు ఇవ్వడంపై ప్రతిపక్షాల నుంచి ఈసీకి ఫిర్యాదులు వెళ్లడం ఖాయం. ఈ నేపథ్యంలో సెర్ఫ్ తన ఉత్తర్వుల్లో తగిన జాగ్రత్తలు సూచించింది. పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని, పింఛన్లు ఇస్తున్నట్లు ఫొటోలు, వీడియోలు తీయకూడదని సెర్ఫ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.