వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు
వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై చట్ట నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ప్రతి దశలో వైసీపీ తరపున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతల అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. స్టేటస్ కో కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తెల్లవారుజామునే కూల్చివేయడం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలోని మరికొన్ని వైసీపీ కార్యాలయాలకు సైతం ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.
పార్టీ కార్యాలయాల కూల్చివేతలపై స్టేటస్ కో కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం.. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. వైసీపీ వివరణ కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై చట్ట నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ప్రతి దశలో వైసీపీ తరపున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది.
ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భంలో కూల్చివేతలపై ఆలోచన చేయాలని హైకోర్టు సూచించింది. ఈ సందర్భంగా అదనపు ఆధారాలు ఉంటే రెండు వారాల్లో సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వాదనలు విన్న తర్వాత మాత్రమే పూర్తిస్థాయి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు కూల్చివేతలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అయితేనే చర్యలు తీసుకోవాలని, లేదంటే పార్టీ కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ పలువురు వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.