ఏపీలో బీఆర్ఎస్ రోల్ పై తోట కీలక వ్యాఖ్యలు
ఏపీలోకి బీఆర్ఎస్ ఎంటర్ అయిన తర్వాత తొలుత నిర్లక్ష్యం చేస్తారు.. ఆ తర్వాత విమర్శలు చేస్తారు.. ఆ తర్వాత దాడి చేస్తారు అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలని ఇప్పటికే కేసీఆర్ తమతో చెప్పారన్నారు.
ఏపీలో ప్రజల గురించి రాజకీయాలు చేయడం మానేసి ఎన్నికల్లో గెలవడం కోసమే పార్టీలు పనిచేస్తున్నాయని అందుకోసం కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని వీటిని చూసి తాను విసిగిపోయానన్నారు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. బీఆర్ఎస్ రాజకీయాలు వీటికి అతీతంగా ఉంటాయన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కేవలం ఏదో ఒక రాష్ట్రం కోసం వచ్చింది కాదని, ఈ దేశం కోసం వచ్చిన పార్టీ అని వివరించారు. దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరాన్ని గుర్తించే కేసీఆర్ ముందుకు వచ్చారన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్షిణాది ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మరీ ముఖ్యంగా ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన చెందారు. ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామన్న బిజెపి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇలా అందరూ ఏపీ ప్రజల్ని వంచించారని తోట చంద్రశేఖర్ విమర్శించారు.
రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లు అవుతున్నా.. ఏపీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామన్నారు. వీటన్నింటికీ బీఆర్ఎస్ ఒక పరిష్కారాన్ని చూపుతోందన్నారు. కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ తరహాలో ఏపీ కూడా అభివృద్ధి చెందితే బాగుంటుందన్నది తన ఉద్దేశం అన్నారు. ప్రస్తుతం తెలుగుజాతి పక్షాన కేసీఆర్ ను మించిన శక్తివంతమైన నాయకుడు కనిపించడం లేదన్నారు. జాతీయ స్థాయిలో తెలుగువారికి నాయకత్వంలో భాగస్వామ్యమే లేకుండా పోయిందన్నారు. ఆ లోటును కేసీఆర్ తీర్చబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. పదేపదే పార్టీలు మారారు అన్న విమర్శల్ని తోటా చంద్రశేఖర్ కొట్టిపారేశారు. తాను ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని తొలుత పిఆర్పీలో చేరానని ఆ పార్టీ నుంచి తాను బయటకు రాలేదని, ప్రజారాజ్యం పార్టీనే కాంగ్రెస్ లో విలీనం అయిపోయిందన్నారు. ఆ తర్వాత ఏపీలో వైసీపీ, టీడీపీ రెండే ప్రత్యామ్నాయ శక్తులుగా మిగిలాయని, అందుకే వైసీపీలో చేరానన్నారు.
వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయ లక్ష్యాలు వేరే అన్న విషయం తనకు అర్థమైందని, అదే సమయంలో పవన్ కల్యాణ్ ముందుకు వచ్చి తాను స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని చెప్పడంతో జనసేన పార్టీలోనికి వెళ్లానని వివరించారు. పవన్ కల్యాణ్ ఏడాది పాటు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వల్లే తోట చంద్రశేఖర్ జనసేన నుంచి బయటకు వచ్చారు అన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అది పూర్తిగా తప్పుడు ప్రచారం అన్నారు.
ఉద్యమ సమయంలో రకరకాల భావోద్వేగాలు ఉంటాయని, ఆ సమయంలో కూడా కేసీఆర్ నాయకులను విమర్శించారే గాని ఏనాడు ఏ ప్రాంత ప్రజల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో ఏ ఒక్క సీమాంధ్రవాసులైనా తెలంగాణలో, హైదరాబాద్‌లో ఇబ్బంది పడ్డారా..? అని ప్రశ్నించారు.
ఏపీలో ఉంటున్న ప్రజలు సంతృప్తిగా ఉన్నారా..? లేక హైదరాబాదులో ఉంటున్న సీమాంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారా..? అన్నది పోల్చి చూస్తే పరిస్థితి అందరికీ అర్థమవుతుందన్నారు. ఏపీ ప్రజలు కుల రాజకీయాలతో విసిగిపోయి ఉన్నారని, ఏపీలో బిఆర్ఎస్ కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తుందన్నారు. ఇప్పటివరకు రాజకీయంగా అణిచివేయబడ్డ వర్గాలన్నింటికీ బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ ఏపీలో వైసీపీకి బీ టీమ్ అన్న విమర్శల్ని తోట కొట్టిపారేశారు. ఏపీలోకి బీఆర్ఎస్ ఎంటర్ అయిన తర్వాత తొలుత నిర్లక్ష్యం చేస్తారు.. ఆ తర్వాత విమర్శలు చేస్తారు.. ఆ తర్వాత దాడి చేస్తారు అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలని ఇప్పటికే కేసీఆర్ తమతో చెప్పారన్నారు. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తోట చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు.