Telugu Global
Andhra Pradesh

పవన్‌కు కేసీఆర్‌ షాక్ తప్పదా?

బీసీలను టీడీపీ వైపుకు ఆకర్షించేందుకు ఒకవైపు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తుంటే మరోవైపు కాపులను జనసేన వైపుకు లాక్కునేందుకు పవన్ పావులు కదుపుతున్నారు. వీళ్ళ ప్రయత్నాలు సీరియస్‌గా జరుగుతుండగా హఠాత్తుగా బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇస్తుండటం పవన్‌కు షాక్ కొడుతుందనటంలో సందేహం లేదు.

పవన్‌కు కేసీఆర్‌ షాక్ తప్పదా?
X

ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న బీఆర్ఎస్ మొదటి అడుగుతోనే కలకలం రేపుతోంది. తోట చంద్రశేఖర్, చింతల పార్ధసారధి, రావెల కిషోర్ బాబు లాంటి వాళ్ళని పార్టీలోకి చేర్చుకోవాలని కేసీఆర్‌ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీళ్ళ ముగ్గురు ప్రగతిభవన్లో సోమవారం కేసీయార్ సమక్షంలోనే బీఆర్ఎస్ కండువాలు కప్పుకోవటానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తోట స్వయంగా ప్రకటించగా మిగిలిన ఇద్దరు ప్రకటించలేదు.

అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వీళ్ళు కూడా పార్టీలో చేరబోతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే తోట చంద్రశేఖర్, చింతల పార్ధసారధి ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులే. వీళ్ళే కాకుండా తొందరలోనే మరికొందరు కాపు ప్రముఖులను బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు కేసీఆర్‌ తరపున చర్చలు జరుగుతున్నాయట. ఈ చేరికలు కూడా ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర నుండే ఉంటాయని సమాచారం.

ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే కేసీఆర్‌ ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఓట్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కాపులు ఏకతాటిపైన నిలిచి ఒకే పార్టీకి మద్దతిచ్చింది లేదు. ఏ పార్టీలో తమకు ప్రాధాన్యత ఉంటుందని అనుకుంటే ఆ పార్టీల్లో బిజీగా ఉన్నారు. బీసీల తర్వాత కాపు సామాజికవర్గం బలమే ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాపుల్లో మెజారిటి వర్గం ఓట్లను వేయించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెగ ప్రయత్నిస్తున్నారు.

బయటకు చెప్పకపోయినా లోలోపల మాత్రం కాపు నేతలతో సమావేశాలు పెట్టించి జనసేన వైపున‌కు కాపులందరినీ మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్యనే వైజాగ్‌లో జరిగిన కాపునాడు సమావేశం ఇందులో భాగమే. బీసీలను టీడీపీ వైపుకు ఆకర్షించేందుకు ఒకవైపు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తుంటే మరోవైపు కాపులను జనసేన వైపుకు లాక్కునేందుకు పవన్ పావులు కదుపుతున్నారు. వీళ్ళ ప్రయత్నాలు సీరియస్‌గా జరుగుతుండగా హఠాత్తుగా బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇస్తుండటం పవన్‌కు షాక్ కొడుతుందనటంలో సందేహం లేదు.

First Published:  2 Jan 2023 11:10 AM IST
Next Story