Telugu Global
Andhra Pradesh

మేమేం సత్యవంతులం కాదు -వైసీపీ ఎమ్మెల్యే

వివరణ ఇచ్చే క్రమంలో తమ హయాంలో కూడా తప్పులు జరుగుతున్నాయని, అయితే టీడీపీ హయాంలో జరిగినంత పెద్దవి కావని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే. తామేం సత్యవంతులం కాదని క్లారిటీ ఇచ్చారు.

మేమేం సత్యవంతులం కాదు -వైసీపీ ఎమ్మెల్యే
X

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో నోరు జారారు. వైసీపీ హయాంలో కూడా చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకున్నారు. ఇటీవల కావలిలో గ్రావెల్ మాఫియా అంటూ మీడియాలో వచ్చిన కథనాలపై వివరణ ఇచ్చేందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అయితే వివరణ ఇచ్చే క్రమంలో తమ హయాంలో కూడా తప్పులు జరుగుతున్నాయని, అయితే టీడీపీ హయాంలో జరిగినంత పెద్దవి కావని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే. తామేం సత్యవంతులం కాదని క్లారిటీ ఇచ్చారు.

టీడీపీ హయాంలోనే గ్రావెల్ మాఫియా పుట్టి పెరిగిందన్నారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఇప్పుడున్న అవసరాల మేరకు గ్రావెల్ తవ్వకం తప్పనిసరి అయిందని, అందుకే అక్కడక్కడా అనుమతుల్లేకుండా గ్రావెల్ తవ్వుకుంటున్నారని చెప్పారు ఎమ్మెల్యే. "అవినీతి ఉంటుంది, ఉండదని ఎవరూ చెప్పరు. అవినీతి రూపుమాపడానికే తామున్నామని అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ చెబుతారు. కానీ దాన్ని కంట్రోల్ చేయడమే మన పని. గతంలో కూడా చాలా ఫిర్యాదులొచ్చాయి, ఇప్పుడూ వస్తున్నాయి, వాటిపై చర్యలు తీసుకోవాలని నేను కూడా ఆర్డీవోకి ఆదేశాలిచ్చా." అని చెప్పారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి.

జగనన్న కాలనీల కోసం..

రోడ్ల నిర్మాణం, జగనన్న కాలనీల్లో పెద్ద ఎత్తున చేపడుతున్న నిర్మాణాలకోసం గ్రావెల్ ఇప్పుడు తప్పనిసరిగా మారిందని చెప్పారు ఎమ్మెల్యే. అందుకే అక్కడక్కడా తవ్వకాలు జరుగుతున్నాయని, అయితే ఈ అవినీతి గత ప్రభుత్వంలో జరిగినంత పెద్దది కాదని చెప్పుకొచ్చారు. అవినీతి గురించి ఎమ్మెల్యే ఉన్నమాట చెప్పేశారని ప్రతిపక్షాలు అప్పుడే రాద్ధాంతం మొదలు పెట్టాయి. అటు మీడియా, సోషల్ మీడియాలో కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో అనబోయి, ఇంకేదో అనేసి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కావలి ఎమ్మెల్యే వ్యాఖ్యలు కూడా సంచలనం కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

First Published:  30 Jan 2023 2:45 PM IST
Next Story