Telugu Global
Andhra Pradesh

గ్లాస్ పగిలితే ఎందుకూ పనికిరాదు

కోవిడ్‌ సమయంలో చంద్రబాబు, పవన్‌ ప్రజలను పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్లారని సునీల్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు. యువరక్తం కావాలని, వీర మహిళలు, యువశక్తి కావాలంటున్న పవన్‌ కల్యాణ్‌.. ఎంతమంది యువతకు సీట్లిచ్చారని ఆయన నిలదీశారు.

గ్లాస్ పగిలితే ఎందుకూ పనికిరాదు
X

తణుకులో బుధవారం జరిగిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కారుమూరి కుటుంబంపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై మంత్రి, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు, వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌ ఘాటుగా స్పందించారు. బుధవారం సాయంత్రమే పవన్‌ వ్యాఖ్యలపై కారుమూరి కౌంటర్‌ ఇవ్వగా, గురువారం ఉదయం ఆయన కుమారుడు సునీల్‌ విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ వ్యాఖ్యలను ఖండించారు.

బాలానగర్‌లో తమకు రెండు స్టీల్‌ ప్లాంట్లు ఉన్నాయంటూ ప్రజాగళం సభలో పవన్‌ చేసిన ఆరోపణలను నిరూపిస్తే.. వాటిని చంద్రబాబుకు ఒకటి, పవన్‌కు మరొకటి గిఫ్ట్‌గా ఇస్తామని కారుమూరి సునీల్‌ స్పష్టం చేశారు. అంతేకాదు.. తమకు స్టీల్‌ ప్లాంట్లు ఉన్నాయని నిరూపిస్తే తమ కుటుంబం రాజకీయ సన్యాసం చేస్తుందని సవాల్‌ చేశారు. బుధవారం సాయంత్రం మంత్రి కారుమూరి కూడా ఇదే విధంగా కౌంటర్‌ ఇవ్వడం గమనార్హం.

కోవిడ్‌ సమయంలో చంద్రబాబు, పవన్‌ ప్రజలను పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్లారని సునీల్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు. యువరక్తం కావాలని, వీర మహిళలు, యువశక్తి కావాలంటున్న పవన్‌ కల్యాణ్‌.. ఎంతమంది యువతకు సీట్లిచ్చారని ఆయన నిలదీశారు. టీడీపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చిన వారికే పవన్‌ సీట్లు ఇచ్చారు తప్ప.. తనను, తన పార్టీని నమ్ముకున్న వారిని పాతాళానికి తొక్కారని ఆయన చెప్పారు. సీఎం సీఎం అంటూ అరిచిన కార్యకర్తలను అథఃపాతాళానికి తొక్కేశారని మండిపడ్డారు. సీఎం జగన్‌ యువతకు టికెట్ల అంశంలో పెద్దపీట వేశారని ఆయన గుర్తుచేశారు. ఇక సైకిల్‌ తుప్పుపట్టి, పంచర్‌ పడిపోయిందని ఆయన చెప్పారు. ప్రజలు సైకిల్‌ని తీసి పక్కన పడేసే సమయం వచ్చేసిందని ఆయన తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో గాజు పగిలితే ఇంకా పదునెక్కుతుందని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. గాజు పగిలితే పనికిరాకుండా పోతుందని ఆయన గుర్తుచేశారు.

First Published:  11 April 2024 1:55 PM IST
Next Story