Telugu Global
Andhra Pradesh

జగన్‌తో భేటీ.. డి.కె.శివకుమార్‌ ఏమన్నారంటే!

కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ డి.కె.శివకుమార్‌తో వైఎస్ జగన్‌ భేటీ అయ్యారని ఆ పేపర్‌ క్లిప్‌లో ఉంది. ఓ మార్ఫింగ్ ఫొటోను సైతం ఆ కథనానికి జోడించారు.

జగన్‌తో భేటీ.. డి.కె.శివకుమార్‌ ఏమన్నారంటే!
X

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ బెంగళూరుకు వెళ్లడంపై ఓ వర్గం మీడియా కొద్ది రోజులుగా తప్పుడు కథనాలు వండి వార్చుతున్న విషయం అంద‌రూ చూస్తున్న‌దే. వైసీపీ అధినేత జగన్‌ కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరుపుతున్నారని.. వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సోషల్‌మీడియాతో పాటుగా కొన్ని మీడియా ఛానెళ్లు తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయి.

ఇదే అంశంపై తాజాగా దిశ ఏపీ బ్యూరోకు సంబంధించి ఓ పేపర్‌ క్లిప్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ డి.కె.శివకుమార్‌తో వైఎస్ జగన్‌ భేటీ అయ్యారని ఆ పేపర్‌ క్లిప్‌లో ఉంది. ఓ మార్ఫింగ్ ఫొటోను సైతం ఆ కథనానికి జోడించారు. చంద్రబాబు పక్కన మోడీ ఉండడంతో పాటు సీబీఐ కేసుల కారణంగా పార్టీ మనుగడ కష్టమని జగన్ భావిస్తున్నారని ఆ పేపర్‌లో రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ డి.కె.శివకుమార్‌తో భేటీ అయ్యారని, పార్టీ పేరు నుంచి వైఎస్సార్ తొలగించి కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారంటూ కథనాన్ని అల్లారు.

అయితే ఈ తప్పుడు ప్రచారం కాస్త డి.కె.శివకుమార్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఈ ఫేక్ వార్తపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన డి.కె.శివకుమార్‌.. కొందరు అక్ర‌మార్కులు తాను జగన్‌ మోహన్ రెడ్డిని కలిసినట్లు ఫేక్ ఫొటోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను జగన్‌ను కలవలేదని స్పష్టం చేశారు. తాను జగన్‌ను కలిసినట్లు సోషల్‌మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు.

First Published:  30 Jun 2024 4:09 PM GMT
Next Story