షర్మిలనే కాదు.. జగనూ నాకు బాగా పరిచయస్తుడే- డీకే శివకుమార్
షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. షర్మిల కలిసినప్పుడు ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్నారు. షర్మిలనే కాకుండా జగన్ కూడా తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తేనన్నారు.
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏపీలో పర్యటించారు. కర్నాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ ఏపీలోనూ తిరిగి కోలుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోందన్న వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి. షర్మిల ద్వారా ఏపీలో తిరిగి తన ఓటు బ్యాంకును వెనుక్కు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకోసం షర్మిలకు కాంగ్రెస్‌కు మధ్య డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ప్రచారం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు షర్మిల, ప్రియాంక గాంధీ మధ్య సుదీర్ఘంగా ఫోన్ సంభాషణలు నడిచినట్టు షర్మిల పార్టీ విషయాలను పక్కగా ప్రచురించే మీడియా సంస్థే కొద్ది రోజుల క్రితం ప్రచురించింది.
ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ఏపీకి వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో శివాలయంలో విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. గతంలో శ్రీకాళహస్తి వచ్చినప్పుడు శివకుమార్‌కు వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించారు. ఈసారి వైసీపీ నేతలు డీకే పర్యటనకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ డీకేను కలిశారు.
అక్కడే మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. కర్నాటకలో కాంగ్రెస్ నాయకులంతా కలిసికట్టుకట్టుగా శ్రమించడంతోనే విజయం సాధ్యమైందన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ఎన్నో ఎత్తులు వేసినా ప్రజలు కాంగ్రెస్‌నే గెలిపించారన్నారు. ఇటీవల షర్మిల తనను కలుస్తుండటంపైనా డీకే శివకుమార్ స్పందించారు. షర్మిల తనకు సోదరి లాంటి వారన్నారు. కేవలం తనకు అభినందనలు తెలిపేందుకు మాత్రమే వచ్చారన్నారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. షర్మిల కలిసినప్పుడు ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్నారు. షర్మిలనే కాకుండా జగన్ కూడా తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తేనన్నారు.