చీరాలలో కరణంకు గ్రీన్ సిగ్నల్
మొన్నటివరకు చీరాల టికెట్ విషయంలో కాస్త సస్పెన్సుండేది. టికెట్ కోసం వెంకటేష్, పోతుల సునీత పట్టుబట్టారు. అయితే సునీతకు ఎమ్మెల్సీ రెన్యువల్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారట.

చీరాలలో కరణంకు గ్రీన్ సిగ్నల్
వచ్చే ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో పోటీ చేయటానికి కరణం వెంకటేష్‌కు గ్రీన్ సిగ్నల్ దొరికింది. నియోజకవర్గంలోని వేటపాలెం మండలంలో జరిగిన పార్టీ సమావేశంలో రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ బీద మస్తాన్ రావు ఈ విషయాన్ని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో చీరాల నుండి వెంకటేష్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే కరణం బలరామ్, ఎమ్మెల్సీ పోతుల సునీత హాజరైన సమావేశంలో వెంకటేష్‌ను అభ్యర్థిగా బీద ప్రకటించారంటే జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే.
ఈ విషయాన్ని కూడా బీద వేదిక మీదే చెప్పారు. జగన్ అనుమతితోనే తాను చెప్పానని ఇదే విషయాన్ని జగన్ తొందరలోనే ప్రకటించబోతున్నట్లు చెప్పారు. బీద ప్రకటించిన వెంటనే సునీత హర్షం వ్యక్తం చేశారు. కరణంకు తన మద్దతు ప్రకటించారు. మొన్నటివరకు చీరాల టికెట్ విషయంలో కాస్త సస్పెన్సుండేది. టికెట్ కోసం వెంకటేష్, పోతుల సునీత పట్టుబట్టారు. అయితే సునీతకు ఎమ్మెల్సీ రెన్యువల్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారట.
దాంతో వెంకటేష్‌కు లైన్ క్లియర్ అయిపోయింది. ఇదే సమయంలో చీరాలలోనే పోటీ చేయాలని పట్టుదలగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరులో పోటీ చేసేట్లు జగన్ కన్వీన్స్ చేశారు. దాంతో చీరాల టికెట్ విషయంలో సమస్యలు క్లియర్ అయిపోయాయి. ఎప్పుడైతే కరణంకు టికెట్ ఖరారైపోయిందో ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్‌లో స్పష్టత వచ్చేసింది.
టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు అద్దంకి, చీరాలలో మంచి పట్టుంది. బలరామ్ తరపున కొడుకు వెంకటేషే చాలాకాలంగా వ్యవహారాలను చక్కబెడుతున్నారు. పోయిన ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన బలరామ్ వివిధ కారణాలతో వైసీపీకి దగ్గరయ్యారు. ఇక 2014లో అద్దంకిలో టీడీపీ తరపున పోటీ చేసిన వెంకటేష్ ఓడిపోయారు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకటేష్ పోటీ చేయటం ఖాయమైపోయింది. ఇక తేలాల్సింది టీడీపీ అభ్యర్ధి ఎవరనేదే.