కరకట్ట భవనం లింగమనేనిదా..? చంద్రబాబుదా..?
లింగమనేని రమేష్ అనే యజమాని నిర్మించుకున్న భవనంలో తాను కేవలం అద్దెకుంటున్నట్లు చెప్పారు. అంటే ముఖ్యమంత్రి హోదాలో సదరు భవనం ప్రభుత్వందన్నారు.
చంద్రబాబు నాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకే అంశంపై తాను అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలాగా వ్యవహరిస్తుంటారు. ఈ అలవాటు మొదటినుండి ఉంది. ఇప్పుడు కూడా అదే పద్దతిలో వెళ్ళాలని అనుకున్నారు కాబట్టే విషయం వివాదాస్పదమైంది. కరకట్టమీద ఉన్న అక్రమ నిర్మాణంలో చంద్రబాబు నివాసముంటున్నారు. ఆ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. క్విడ్ ప్రోకోలో భాగంగా లింగమనేనికి చంద్రబాబుకు మధ్య జరిగిన వ్యవహారాల్లో అక్రమ నిర్మాణం కూడా ఒకటని సీఐడీ ఫిర్యాదు చేసింది.
అందుకనే సదరు నిర్మాణాన్ని ప్రభుత్వం అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇక్కడ విషయం ఏమిటంటే.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే వివాదంపై చంద్రబాబు మాట్లాడుతూ ఆ భవనం ప్రభుత్వ భవనం కాబట్టే తాను అక్కడ ఉంటున్నట్లు చాలాసార్లు ప్రకటించారు. పైగా కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఫర్నిచర్ తో పాటు భద్రతా ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇంటివైపునకు సొంత పార్టీ నేతలనే రానిచ్చేవారు కాదు.
సరే.. ఇక ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇదే వివాదంపై అసెంబ్లీలో మాట్లాడుతూ అసలా భవనంతో తనకు సంబంధమే లేదన్నారు. లింగమనేని రమేష్ అనే యజమాని నిర్మించుకున్న భవనంలో తాను కేవలం అద్దెకుంటున్నట్లు చెప్పారు. అంటే ముఖ్యమంత్రి హోదాలో సదరు భవనం ప్రభుత్వందన్నారు. ప్రతిపక్షంలోకి రాగానే అదే భవనం లింగమనేనిది అన్నారు. రెండింటిలో ఏది వాస్తవం.
రెండింటిని పక్కనపెడితే సదరు నిర్మాణం అక్రమకట్టడం అన్నది మాత్రం వాస్తవం. ఎలాగంటే చంద్రబాబు అధికారంలోకి రాగానే కరకట్టమీద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని డిసైడ్ చేసింది. అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన వాటిని తొలగించేందుకు వీలుగా యజమానులందరూ భవనాలను ఖాళీచేయాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఆ నోటీసులను స్వయంగా అప్పటి మంత్రి దేవినేని ఉమ యజమానులకు అందించారు. అందులో లింగమనేని భవనం కూడా ఉంది. తర్వాత ఏమైందో ఏమో సడెన్ గా ఆ భవనంలోకి చంద్రబాబు చేరిపోయారు. అప్పటినుండి అక్రమనిర్మాణం కాస్త సక్రమ నిర్మాణంగా మారిపోయింది.
నిజంగా అది ప్రభుత్వ భవనమే అయితే అందులో చంద్రబాబు ఉండేందుకు లేదు. ఎందుకంటే అందులో ఉండటానికి చంద్రబాబు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా..? ఒకవేళ అది ప్రైవేటు భవనమే అయితే దాన్ని ప్రభుత్వ భవనంగా చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు ప్రకటించారు..? పై రెండు విషయాల్లో ఏదో ఒకటే వాస్తవం. చంద్రబాబు ఎప్పటికీ నిజం చెప్పరు.. కాబట్టి ప్రభుత్వమే వాస్తవం ఏమిటో ప్రకటించి జనాలకు క్లారిటీ ఇవ్వాల్సుంటుంది.