Telugu Global
Andhra Pradesh

వైసీపీలోకి నిత్య అసంతృప్త నేత..?

ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఉండలేరు. ముందు కాంగ్రెస్, తర్వాత టీడీపీ ఆ తర్వాత కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ చివరకు ఇండిపెండెంటుగా కూడా పోటీచేశారు. గెలిచినా, ఓడినా, పదవిలో ఉన్నా లేకపోయినా ముద్రగడకు క్లీన్ ఇమేజైతే ఉంది.

వైసీపీలోకి నిత్య అసంతృప్త నేత..?
X

ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ వైసీపీలో అనూహ్యమార్పులు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చటం, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీచేయించటం, అలాగే కొందరు ఎమ్మెల్యేల‌ను ఎంపీలుగా పోటీచేయించాలని అనుకుంటున్నారు. కొందరు సిట్టింగులకు అసలు టికెట్లే ఇవ్వకపోవటం కూడా ఇందులో భాగమే. అలాంటిదే మరో విషయం ఏమిటంటే.. ముద్రగడ పద్మనాభం తొందరలోనే వైసీపీలో చేరబోతున్నారట. చాలాకాలం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని అనుకుంటున్న ముద్రగడ అందుకు వైసీపీని వేదికగా చేసుకోబోతున్నట్లు సమాచారం.

కాపు ఉద్యమనేతగా ముద్రగడ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముద్రగడతో పాటు ఆయన కుటుంబం ఎన్ని అవమానాలకు గురయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పటినుంచి చంద్రబాబు అంటేనే ముద్రగడ తీవ్రంగా మండిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే తొందరలోనే వైసీపీలో చేరాలని ముద్రగడ డిసైడ్ అయ్యారట. ముద్రగడే వైసీపీలో చేరాలని అనుకున్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డే పార్టీలో చేరమని ముద్రగడను ఆహ్వానించారో తెలీదు.

విషయం ఏదైనా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రెండుసార్లు ముద్రగడతో భేటీ అయ్యింది వాస్తవం, పార్టీలో చేరాలని ఆహ్వానించింది నిజం. అన్నీకలిసొచ్చి ఫైనల్ గా వైసీపీలో చేరాలని అనుకున్నారట. ఆ మధ్య ముద్రగడే పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ఏమిటంటే.. ఉద్యమనేత కొడుకు చల్లారావు పోటీచేయబోతున్నారట. కాకినాడ ఎంపీగా గానీ పెద్దాపురం ఎమ్మెల్యేగా కానీ చల్లారావు పోటీచేసే అవకాశముందని తెలుస్తోంది. ఇక్కడ సమస్య ఏమిటంటే ముద్రగడతో వేగటం అంత ఈజీకాదు. ఆయనకు నిత్యసంతృప్త నేతగా పేరుంది.

ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఉండలేరు. ముందు కాంగ్రెస్, తర్వాత టీడీపీ ఆ తర్వాత కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ చివరకు ఇండిపెండెంటుగా కూడా పోటీచేశారు. గెలిచినా, ఓడినా, పదవిలో ఉన్నా లేకపోయినా ముద్రగడకు క్లీన్ ఇమేజైతే ఉంది. చిన్న విషయాలకు కూడా తీవ్రంగా అలగటం, ఎవరితోనూ రాజీపడలేకపోవటం, విషయం ఏదైనా తనమాటే నెగ్గాలన్న పట్టుదల వల్లే ఏ పార్టీలోనూ, ఎవరితోనూ సరిగా ఇమడలేకపోతున్నారనే ప్రచారముంది. నిజానికి ముద్రగడ వైసీపీలో చేరటం చాలామందికి ఇష్టంలేదట. అయితే అధినేత సానుకూలంగా ఉన్నారు కాబట్టే ఏమీ మాట్లాడలేకపోతున్నారని సమాచారం.

First Published:  20 Dec 2023 9:32 AM IST
Next Story