ముద్రగడ సంధించిన మరో లేఖాస్త్రం..!
పవన్ కల్యాణ్ కాపులకు ఏదైనా మేలు చేశారా? అని ముద్రగడ ప్రశ్నించారు. కాపు ఉద్యమంలో కేసుల్లో ఇరుక్కున్న వారిని ఏరోజైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. కాపులపై కేసులు పెడితే ఎందుకు స్పందించలేదు?
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ విసురుతున్న పంచ్ డైలాగ్స్ రివర్స్ కొడుతున్నాయి. కాకినాడలో అధికార పార్టీపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు. తొక్కతీస్తా, నారతీస్తా లాంటి పదజాలాన్ని ప్రయోగించడం రాజకీయ నాయకుడికి తగదన్నారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. పవన్ వ్యాఖ్యలు కాపుల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. పవన్‌కు ముద్రగడ పద్మనాభం గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్‌ను ముద్రగడ విమర్శించడాన్ని తప్పుబట్టారు హరిరామ జోగయ్య. ఇప్పుడు ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంటోంది. తాజాగా తనపై పవన్ అభిమానులు చేస్తున్న విమర్శలపై ముద్రగడ మరో లేఖను విడుదల చేశారు.
కాకినాడలో జనసేనాని చేసిన వ్యాఖ్యలను ముద్రగడ తన తొలి లేఖలో తప్పుబట్టారు. తాను అమ్ముడుపోయానన్న పవన్ కల్యాణ్.. తాను వదిలేసిన కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఎందుకు కొనసాగించలేదని ముద్రగడ ప్రశ్నించారు. ఎమ్మెల్యేను తిట్టడానికి సమయం వృథా చేసుకోవద్దని జనసేనానికి సూచించారు. రాజకీయాల్లోకి వచ్చాక పది మందితో ప్రేమించబడాలి తప్ప వీధి రౌడీ భాషను ప్రయోగించడం సరికాదన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తాత, తండ్రులు అక్రమంగా సంపాదించలేదన్న ముద్రగడ, వాళ్లు పదిమందికి సాయం చేసిన వాళ్లే తప్ప ఎవరికీ నష్టం చేయలేదని అన్నారు.
ముద్రగడ విమర్శలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య కౌంటర్ ఇచ్చారు. ముద్రగడ వెనుక ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో జనసేనకు వ్యతిరేకంగా ముద్రగడ పనిచేశారని ఆరోపించారు. ఆ తరువాత పవన్ అభిమానులు సైతం ముద్రగడపై ఘాటు విమర్శలు చేశారు. దీంతో పవన్ తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు ముద్రగడ పద్మనాభం. తాజాగా విడుదల చేసిన లేఖలో దమ్ముంటే పిఠాపురంలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
పవన్ కల్యాణ్ కాపులకు ఏదైనా మేలు చేశారా? అని ముద్రగడ ప్రశ్నించారు. కాపు ఉద్యమంలో కేసుల్లో ఇరుక్కున్న వారిని ఏరోజైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. కాపులపై కేసులు పెడితే ఎందుకు స్పందించలేదు? జైళ్లలో ఉన్నవారికి మీరేమైనా బెయిల్ ఇప్పించారా అని లేఖలో అడిగారు ముద్రగడ. తుని ఘటన బాధితులపై స్పందించారా? తునిలో కాపులపై కేసులను జగన్ ఎత్తివేసిన సంగతి నీకు తెలియదా? కాపు కులాన్ని నేను స్వార్థం కోసం వాడుకుంటున్నానా? కాపుల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా? మీ కోసం అందరూ రోడ్డు మీదకు రావాలా? నన్ను పోలీసులు బూటు కాళ్లతో తన్నినప్పుడు మీరెక్కడ? నా ఫ్యామిలీని బూతులు తిడితే మీరేమైపోయారు? మీ వాళ్లతో తిట్టించి నన్ను పోటీకి లాగుతున్నారా? అని ముప్పై ప్రశ్నలు సంధించారు ముద్రగడ పద్మనాభం.
ముద్రగడ తాజా లేఖ కాపు సామాజిక వర్గంలో కాకపుట్టిస్తోంది. ముఖ్యమంత్రి సీటుకు గాలమేసుకు కూర్చుకున్న పవన్ కల్యాణ్‌కు సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత ఎదురవుతుండటంతో జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. మరి ముద్రగడ లేఖపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.